మార్కెట్ పంచాంగం
అంతర్జాతీయంగానూ, దేశీయంగానూ గతవారం అనుకూల, ప్రతికూలాంశాలేవీ లేకపోవడంతో భారత్ మార్కెట్ పరిమితంగా కదిలింది. వరుసగా రెండోవారం స్వల్ప లాభాలతో ముగియగలిగింది. అయితే ఈ వారం వెలువడే పలు వార్తల కారణంగా మార్కెట్ కదలికలు వేగవంతం కావొచ్చు. జీడీపీ డేటా, ఆర్‌బీఐ పాలసీ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశం, అమెరికా ఫెడ్ చైర్మన్ యెలెన్ అక్కడి కాంగ్రెస్ సమావేశంలో ఇచ్చే ప్రెజెంటేషన్ వంటివి ప్రపంచ, దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించవచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
నవంబర్ 27తో ముగిసిన నాలుగు రోజుల ట్రేడింగ్ వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ కనిష్టస్థాయి వద్ద పదేపదే మద్దతు పొందుతూ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 260 పాయింట్ల లాభంతో 26,128 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం మార్కెట్ పంచాంగంలో సూచించిన అంచనాలకు అనుగుణంగా ప్రస్తుతం సెన్సెక్స్ 26,100-26,200 నిరోధ శ్రేణి వద్ద నిలిచివుంది. ఈ వారం ఈ శ్రేణిపైన ముగిస్తే 26,440 స్థాయిని అందుకునే ఛాన్స్ వుంటుంది. అటుతర్వాత అక్టోబర్ 26 నాటి గరిష్టస్థాయి అయిన 26,618 స్థాయిని పరీక్షించవచ్చు. తొలి నిరోధశ్రేణిపైన ముగియలేకపోతే క్రమేపీ 25,700 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయి గత ఐదు రోజుల నుంచి వరుసగా మద్దతును అందిస్తున్న కారణంగా 25,700 పాయింట్ల లోపు ముగిస్తే తిరిగి డౌన్‌స్వింగ్ మొదలుకావొచ్చు. ఆలోపున ముగిస్తే మద్దతు స్థాయిలు 25,440, 25,100 పాయింట్లు.
నిఫ్టీ మద్దతు శ్రేణి 7,810-7,860
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 7,943 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో నిఫ్టీ 7,810-7,860 పాయింట్ల శ్రేణిలో మద్దతు పొందినందున, సమీప భవిష్యత్తులో ఈ శ్రేణి కీలకం. ఈ వారం ఈ శ్రేణి దిగువన ముగిస్తే గత రెండు వారాల అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడవచ్చు. ఆ లోపున 7,700 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 7,600 స్థాయి వద్దకు తగ్గవచ్చు. ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగితే 8,005 పాయింట్ల సమీపంలో తొలి నిరోధం కలగవచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 8,100 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఈ స్థాయిని బ్రేక్‌చేస్తే తదుపరి వారాల్లో 8,336 పాయింట్ల వరకూ పెరిగే చాన్స్ వుంది.
సెన్సెక్స్ మద్దతు 25,700
Published Mon, Nov 30 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM
Advertisement
Advertisement