‘సమైక్య’ పిటిషన్లపై విచారణ 18కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్లను పరిశీలిస్తామని, సవివరంగా విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు భరోసా ఇచ్చింది. రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, పారిశ్రామికవేత్త కె.రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, కె.కృష్ణమూర్తి అనేవ్యక్తి పిటిషన్లు వేయగా వీటిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తొలి పిటిషన్‌కు జతపరిచింది.
తాజాగా వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా గురువారంరాత్రి రిజిస్ట్రీ ప్రధాన పిటిషన్‌కు జతచేసింది. దీంతో మొత్తంగా నాలుగు పిటిషన్లు శుక్రవారం జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ మదన్ బి.లోకూర్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. అయితే తమ తరఫు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, ఈ దృష్ట్యా 11వ తేదీకి కేసును వాయిదావేయాలని మొదటి పిటిషనర్ రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించడంతో దాన్ని పరిశీలించిన ధర్మాసనం.. మొత్తం పిటిషన్లను తర్వాత విచారిస్తామంటూ మరో కేసు విచారణకు ఉపక్రమించబోయింది.
ఈ దశలో సోమయాజులు తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ...‘‘ఈ రోజు(శుక్రవారం) విచారణ కేసుల జాబితాలో 65వ నంబర్‌గా లిస్టయిన రిట్ పిటిషన్ నం.940/2013ని విచారణకోసం ఇప్పటికే మీముందు ప్రస్తావించాం. కేంద్రప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని ఇందులో సవాల్ చేశాం. మీరు దీన్ని పరిశీలించాలి’’ అని అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రధాన పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరని లేఖ అందినందున పిటిషన్లను పరిశీలించలేదని పేర్కొంది.
సాల్వే మళ్లీ మాట్లాడుతూ.. ‘‘పిటిషన్‌లోని 26వ పేజీలో మా ప్రార్థన ఉంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్నే మొత్తంగా సవాల్ చేసిన పిటిషన్ ఇది. మీరు చూడండి’’ అని కోరారు. ఈ అభ్యర్థనకు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు సానుకూలంగా స్పందిస్తూ..‘‘పిటిషన్లను మేం పరిశీలిస్తాం. ఈ విషయాన్ని మేం వివరంగా విచారిస్తాం. ఆ మేరకు భరోసా ఇవ్వగలం’’ అన్నారు. విచారణను 11న జరపాలని ప్రధాన పిటిషనర్ తరఫు మరో సీనియర్ న్యాయవాది బి.పి.పాటిల్ కోరగా, 11న వీలుపడదని, 18న విచారిస్తామని చెబుతూ జస్టిస్ దత్తు విచారణను వాయిదా వేశారు. 2013 అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ ఆదేశాలివ్వాలనేది సోమయాజులు పిటిషన్‌లోని ప్రధాన ప్రార్థన.