యూపీ మంత్రికి చుక్కెదురు
గాయత్రి ప్రజాపతి ఎఫ్ఐఆర్ నమోదుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా స్థాయి నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను అజ్ఞాపించింది.
మూడేళ్ల క్రితం ప్రజాపతిని కలిసినప్పుడు తనపై ఆయన అత్యాచారానికి పాల్పడ్డారని 35 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘాతుకాన్ని ఫొటోలు తీశారని వెల్లడించింది. ఈ ఫొటోలను బయటపెడతామని భయపెట్టి గత రెండేళ్లుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తానని మంత్రి ప్రజాపతి తెలిపారు. బీజేపీ కుట్రపూరితంగా తనకు వ్యతిరేకంగా కేసు పెట్టించిందని ఆయన రోపించారు. వాస్తవాలు త్వరలోనే వెల్లడవుతాయని అన్నారు.