న్యూఢిల్లీ:అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపడానికి సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. జయ పిటిషన్‌ను ఈ వారంలోనే విచారించాలన్న జయ తరఫు న్యాయవాది ఫాలీ నారీమన్ విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతత్వంలోని ధర్మాసనం మన్నించింది. దీపావళికి ముందు జైల్లోంచి బయటకు రావాలంటే ఈ నెల 17 (శుక్రవారం) జయకు చివరి అవకాశం. శుక్రవారం తర్వాత వారం రోజులు సుప్రీం కోర్టుకు సెలవులు రానున్నాయి.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు గత నెలాఖర్లో నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. వంద కోట్ల జరిమానా విధించడంతో జయ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించడంతో ఆమె నెల 9న సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.