'తమిళనాడుకు తరలించినా అభ్యంతరం లేదు'
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం జయలలితను తమిళనాడు జైలుకు తరలించినా తమకు ఎటువంటి అభ్యతరం లేదని కర్ణాటక హోంశాఖ స్పష్టం చేసింది. దీనిపై పొరుగు రాష్ట్రం తమిళనాడు కోర్టు నుంచి అనుమతులు తీసుకుంటే కర్ణాటక ప్రభుత్వానికి ఏ విధమైన అడ్డంకులూ లేవని హోంమంత్రి కేజే జార్జ్ తెలిపారు. మాజీ ప్రధాని హెచ్ డీ దేవగౌడ మరియు కొంతమంది ప్రముఖల ద్వారా ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జయలలిత కర్ణాటక జైల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడటమే కాకుండా, మద్దతుదారుల ఆందోళనతో చట్టపరమైన సమస్యలు కూడా వస్తాయని దేవగౌడ సూచించారు.
ఆమె కర్ణాటక జైలులోనే ఉంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని నిఘా అధికారులు ఆదివారం సీఎం సిద్ధరామయ్యతో చెప్పినట్లు తెలిసింది. ‘‘జయను చూసేందుకు వేలాదిగా తమిళలు జైలు వద్దకు చేరుకుని గొడవ చేస్తున్నారు.సుప్రీం కోర్టులో జయ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అక్కడా బెయిల్ మంజూరు కాకపోతే కర్ణాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముంది’’ అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం జయ జైలు మార్పిడి విషయంలో సానుకూలంగా స్పందించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, వందకోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.