
అమాయక ముస్లింలను నిర్బంధించొద్దు: షిండే
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరు పేరుతో అమాయక ముస్లిం యువతను అక్రమంగా నిర్బంధించకూడదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే సోమవారం రాష్ట్రాలను ఆదేశించారు. ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తే బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దీనిపై రాజకీయ దుమారం రేగింది. ఇది ఓటు బ్యాంకు రాజకీయమని విపక్షాలు దుయ్యబట్టాయి. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ ఆదేశమిచ్చారని బీజేపీ మండిపడింది. మతం పేరుతో దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించిన షిండేను వెంటనే పదవి నుంచి తప్పించాలని, ఆదేశాన్ని వాపసు తీసుకోవాలని డిమాండ్ చేసింది. షిండే దీన్ని తోసిపుచ్చారు. తన రోజువారీ విధుల్లో భాగంగానే సీఎంలకు లేఖ రాశానని ఢిల్లీలో విలేకర్లతో అన్నారు.
లేఖలో ఏముందంటే.. : పోలీసులు అమాయక ముస్లిం యువతను వేధిస్తున్నారంటూ కేంద్రానికి ఫిర్యాదులు వచ్చాయని షిండే తన లేఖలో తెలిపారు. ‘మైనారిటీ వర్గాల యువకులు తమను ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకుని, తమను ప్రాథమిక హ క్కులకు దూరం చేస్తున్నారని భావిస్తున్నారు. అమాయకులను అనవసరంగా వేధించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ఉగ్రవాద కేసుల విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులను సంప్రదించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని పేర్కొన్నారు. ఇతర పెండింగ్ కేసులకంటే వీటికే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో ఐదేళ్లు జైల్లో గడిపిన 9 మంది ముస్లింలకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లేవని జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించిన నేపథ్యంలో షిండే లేఖ రాశారు. ఇదిలాఉండగా, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా షిండే లేఖ రాశారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు.