
పవార్ ప్రధాని అయితే సంతోషం: షిండే
షోలాపూర్: ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్‌పవార్ ప్రధాని అయితే సంతోషిస్తానని, అదే రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. పవార్ తన రాజకీయ గురువని.. ఆయనవల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. కానీ, తన వ్యాఖ్యల ప్రభావాన్ని ఆలస్యంగా గుర్తించిన షిండే వివాదం పెద్దది కాకుండా రాహుల్ గాంధీకి జైకొట్టారు. రాహుల్‌ను తదుపరి ప్రధానిని చేయడమే కాంగ్రెస్ ముఖ్య లక్ష్యమన్నారు.
షిండే శనివారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో మరాఠీ పత్రికల ఎడిటర్లతో మాట్లాడారు. ప్రధాని కావాలన్న ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. 1992 నుంచి పవార్ కూడా దాని కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారని తెలిపారు. కానీ, ఢిల్లీ రాజకీయాలకు ఆయన బాధితుడిగా మారారన్నారు. కాగా, షిండే వ్యాఖ్యలతో ప్రధాని మన్మోహన్ సింగ్ వారసుడు కాంగ్రెస్ అభ్యర్థి కాదని కాంగ్రెస్ అంగీకరించినట్లయిందని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. పవార్ ప్రధాని కావడమన్నది షిండే పగటికల అని పేర్కొన్నారు.