‘చిన్నమ్మ’కు కోపం వచ్చింది!
న్యూఢిల్లీ: బీజేపీలో ‘చిన్నమ్మ’గా సుపరిచితురాలైన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సోషల్ మీడియా వేదికగా ప్రజలను సమస్యలను పరిష్కరిస్తున్నారు. ట్విటర్ ద్వారా రోజు ఎంతో మంది తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకొస్తున్నారు. వెంటనే స్పందించి ఆమె చర్యలు చేపడుతున్నారు. అయితే కొంతమంది అడ్డదిడ్డమైన ప్రశ్నలతో ‘చిన్నమ్మ’ను విసిగిస్తున్నారు.
పుణేకు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి ప్రశ్నతో ఆమె ఆగ్రహానికి గురయ్యాడు. ‘మేడమ్ దయచేసి నా భార్యను నా దగ్గరకు చేర్చండి. ఆమె ఝాన్సీ రైల్వే స్టేషన్ లో పనిచేస్తోంది. నేను పుణే ఐటీలో ఉద్యోగం చేస్తున్నాను. ఆమెను పుణేకు బదిలీ చేసేందుకు మీరు సహయపడగలర’ని అభ్యర్థించాడు. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? అంటూ అతడిపై సుష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీవు, నీ భార్య నా మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంటే ఇలాంటి ప్రశ్న అడిగినందుకు సస్పెన్షన్ ఆర్డర్ పంపించేదాన్ని’ అని ఘాటుగా బదులిచ్చారు.
అంతేకాదు అతడి ట్వీట్ ను రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు పంపించారు. ఆయన స్పందిస్తూ... ‘ ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు సుష్మాస్వరాజ్ కు ధన్యవాదాలు. ఉద్యోగుల బదిలీల్లో నా జోక్యం ఉండదు. రైల్వే బోర్డు ఈ వ్యవహారాలు చూసుకుంటుంద’ని చెప్పారు.
If you or your wife were from my Ministry and such a request for transfer was made on twitter, I would have sent a suspension order by now. https://t.co/LImngQwFh6
— Sushma Swaraj (@SushmaSwaraj) January 8, 2017