Pune man
-
సార్ మా ఇంటి దగ్గర ఎలియన్ ఉంది!
పూణె : ఎలియన్స్ భూమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వాటి గ్రహానికి పంపుతున్నాయి. దానిలో భాగంగా అవి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. అదేంటో కనుక్కోండి సార్ అంటూ ప్రధాని కార్యాలయానికి ఈ మెయిల్ చేసాడో వ్యక్తి. ఈ విషయం గురించి విచారణ చేసిన పోలీసులు సదరు వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇలా చేశాడని తేల్చారు. ఆసక్తి రేపిన ఈ సంఘటన వివరాలు.. కొథ్రూడ్ ప్రాంతానికి చెందిన ఓ 47 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా బ్రెయిన్ హ్యామరేజ్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతను మానసిక పరిస్థితి క్షీణించింది. కొన్ని రోజుల క్రితం తన ఇంటి బయట మూడు లైట్లు వెలుగుతుండటం చూశాడు. దాంతో అవి ఎలియన్స్‌కు సంబంధించిన వస్తువులగా భావించాడు. ఈ విషయం గురించి విచారణ చేయాల్సిందిగా ప్రధాని ఆఫీస్‌కు ఈ- మెయిల్ చేశాడు. ‘ఎలియన్స్‌కు సంబంధించిన వస్తువు ఒకటి నా ఇంటి సమీపంలో తిరగుతుంది. అది భూమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వాటి గ్రహానికి చేరవేస్తుంది. దీని వల్ల మనకు అపాయం కల్గుతుంది. కాబట్టి వెంటనే ఈ విషయం గురించి విచారణ చేపట్టండి’ అంటూ ప్రధాని ఆఫీస్‌కు ఈ మెయిల్ చేశాడు. పీఎంఓ అధికారులు దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేశారు. ప్రభుత్వ ఆదేశం మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సదరు వ్యక్తి మానసిర స్థితి సరిగా లేకపోవడంతో ఇలా చేశాడని తేల్చారు. అతను ఇలా మెయిల్ చేసిన విషయం ఇంట్లో కుటుంబ సభ్యులేవరికి తెలియదన్నారు. -
‘చిన్నమ్మ’కు కోపం వచ్చింది!
న్యూఢిల్లీ: బీజేపీలో ‘చిన్నమ్మ’గా సుపరిచితురాలైన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సోషల్ మీడియా వేదికగా ప్రజలను సమస్యలను పరిష్కరిస్తున్నారు. ట్విటర్ ద్వారా రోజు ఎంతో మంది తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకొస్తున్నారు. వెంటనే స్పందించి ఆమె చర్యలు చేపడుతున్నారు. అయితే కొంతమంది అడ్డదిడ్డమైన ప్రశ్నలతో ‘చిన్నమ్మ’ను విసిగిస్తున్నారు. పుణేకు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి ప్రశ్నతో ఆమె ఆగ్రహానికి గురయ్యాడు. ‘మేడమ్ దయచేసి నా భార్యను నా దగ్గరకు చేర్చండి. ఆమె ఝాన్సీ రైల్వే స్టేషన్ లో పనిచేస్తోంది. నేను పుణే ఐటీలో ఉద్యోగం చేస్తున్నాను. ఆమెను పుణేకు బదిలీ చేసేందుకు మీరు సహయపడగలర’ని అభ్యర్థించాడు. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? అంటూ అతడిపై సుష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీవు, నీ భార్య నా మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంటే ఇలాంటి ప్రశ్న అడిగినందుకు సస్పెన్షన్ ఆర్డర్ పంపించేదాన్ని’ అని ఘాటుగా బదులిచ్చారు. అంతేకాదు అతడి ట్వీట్ ను రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు పంపించారు. ఆయన స్పందిస్తూ... ‘ ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు సుష్మాస్వరాజ్ కు ధన్యవాదాలు. ఉద్యోగుల బదిలీల్లో నా జోక్యం ఉండదు. రైల్వే బోర్డు ఈ వ్యవహారాలు చూసుకుంటుంద’ని చెప్పారు. If you or your wife were from my Ministry and such a request for transfer was made on twitter, I would have sent a suspension order by now. https://t.co/LImngQwFh6 — Sushma Swaraj (@SushmaSwaraj) January 8, 2017 -
ఉరేసుకుని పుణే వాసి ఆత్మహత్య
జలదంకి : చెట్టుకు ఉరేసుకుని మహారాష్ట్రలోని పుణే జిల్లా వాగోలి తాలూకా తుకారాం నగర్‌కు చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని జమ్మలపాళెం పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రాజు లక్ష్మణ్ యాదవ్ (33) జమ్మలపాళెం సమీపంలోని చింతచెట్టుకు ఉరేసుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జలదంకి ఎస్సై అంజిరెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చెట్టుకు దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించి మృతుడి వద్ద ఆధారాలు కోసం పరిశీలించారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్యాదవ్గా గుర్తించారు. అయితే మృతుడు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు. ఇక్కడ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు మహారాష్ట్ర పోలీసులకు తెలిజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'సచిన్ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తాం'
ముంబై: సెలెబ్రిటీలు అంబాసిడర్లుగా ఉన్న కంపెనీ లేదా సంస్థ ఉత్పత్తులు కొని మోసపోయామంటూ ఆయా సెలెబ్రిటీలపై వినియోగదారులు కేసులు వేసిన సంఘటనల గురించి విన్నాం. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీ తనను మోసం చేసిందని తాజాగా పుణె వాసి వాపోతున్నాడు. ఈ విషయంలో సచిన్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 నుంచి ముంబైలోని బాంద్రాలో గల సచిన్ నివాసం ముందు తన కుటుంబ సభ్యులతో కలసి నిరవధిక నిరాహారదీక్ష చేపడుతానని సందీప్ ఖుర్హడే అనే ల్యాబ్ టెక్నీషియన్ హెచ్చరించాడు. ఆయన చెప్పిన వివరాలిలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థ అమిత్ ఎంటర్ ప్రైజెస్‌కు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. పుణెలో పెద్దల ద్వారా సందీప్‌కు సంక్రమించిన భూమిని, ఆయన మామ శివాజీ పింజన్ సమ్మతితో నాలుగేళ్ల క్రితం అమిత్ ఎంటర్ ప్రైజెస్ కొనుగోలు చేసింది. దీని విలువ రెండు కోట్ల రూపాయలు కాగా, అప్పట్లో అమిత్ ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యం సందీప్‌కు 20 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించింది. కాగా ఈ ఆస్తిలో శివాజీ వాటా కింద ఆయనకు కోటి 50 లక్షల రూపాయలు చెల్లించింది. ఈ నేపథ్యంలో సచిన్ అమిత్ ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యంతో మాట్లాడి తనకు న్యాయం చేయాలని సందీప్ కోరుతున్నాడు. 'సచిన్ గురించి ఎంతో విన్నాం. ఆయన మానవతావాది, ఇతరులకు సాయం చేసే వ్యక్తి. బిల్డర్ నుంచి తమకు న్యాయం చేయాలని కోరుతూ సచిన్ ఇంటి ఎదుట దీక్ష చేపడుతాం' అని సందీప్ చెప్పాడు. బాంద్రా పోలీస్ స్టేషన్ ఏసీపీకి ఈ మేరకు లేఖ రాశారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా సందీప్ పోలీసులను కోరాడు. కాగా సందీప్ ఆరోపణలను అమిత్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం కొట్టిపారేసింది. 'సందీప్ తల్లి రంజన ఆ ఆస్తిపై గల హక్కులను ఆమె తమ్ముడు శివాజీకికి బదలాయించింది. ఆమె తన భర్త సమక్షంలోనే ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేయించింది. శివాజీ ఈ డీడ్ తమకు సమర్పించాడు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధిత కాపీని తీసుకుని సరిచూసుకున్న తర్వాతే భూమి కొనుగోలు చేశాం. శివాజీ నుంచి ఈ భూమిని కోటి 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాం. ఆయన కోరిక మేరకు రంజనకు 20 లక్షలు చెల్లించాం' అని అమిత్ ఎంటర్ప్రైజెస్ యజమానులు చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థకు సచిన్‌తో సంబంధం లేదని వివరించారు. సచిన్ 2000 నుంచి 2014 వరకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని తెలిపారు.