
పెట్టుబడులకు భారత్ సురక్షితమైన దేశం
సింగపూర్: పెట్టుబడులకు భారత్ సురక్షితమైన, అనుకూలమైన దేశంగా కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. 8 శాతం పైగా వృద్ధి సాధించడంతో పాటు మెరుగైన రాబడులు అందించగలిగే సత్తా ఉందన్నారు. రెండో దక్షిణాసియా ప్రవాసీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. పటిష్టమైన ఆర్థిక మూలాల కారణంగా భారత్‌ని పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా నిలుస్తోందని తెలిపారు. ఎకానమీని స్థిరపర్చేందుకు, ఇన్వెస్టర్లకు మరింత భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చిదంబరం చెప్పారు. కార్పొరేట్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ మొదలుకొని ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ ఫండ్స్ దాకా భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. భారత ఈక్విటీ మార్కెట్లు 2003-2013 మధ్య 15.8 శాతం మేర వార్షిక వృద్ధి కనపర్చగా, గడిచిన మూడేళ్లలో ప్రభుత్వ బాండ్లపై సగటున 7.92 -8.36 శాతం మేర రాబడులు వచ్చాయని తెలిపారు. ఇలాంటి రాబడులు ప్రపంచంలో కొన్ని మార్కెట్లు మాత్రమే ఇవ్వగలిగాయన్నారు.
అధిక వృద్ధికి మరిన్ని పెట్టుబడులు అవసరం..
అధిక వృద్ధి రేటును నిలబెట్టుకునేందుకు మరిన్ని పెట్టుబడులు కావాల్సి ఉంటుందని చిదంబరం చెప్పారు. ఈ దిశగా ద్రవ్య లోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3 శాతం కన్నా తక్కువకి పరిమితం చేయడం, కరెంటు ఖాతా లోటును కట్టడి చేయడం మొదలైన వాటిపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని వివరించారు. అలాగే ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వల్ల ద్రవ్యోల్బణం క్రమేపీ 5 శాతం దిగువకు రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రూపాయి స్పెక్యులేషన్ కట్టడి చేశాం..: కరెన్సీ మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు, స్పెక్యులేషన్‌ని చాలా మటుకు కట్టడి చేయగలిగామని చిదంబరం చెప్పారు. దేశీ కరెన్సీ మారకం ప్రస్తుతం సిసలైన విలువలోకదలాడుతోందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
డిసెంబర్ క్వార్టర్ బావుంటుంది: ప్రపంచ బ్యాంక్
వాషింగ్టన్: ప్రస్తుత మూడో క్వార్టర్(అక్టోబర్-డిసెంబర్)లో పెద్ద దేశాల కు సంబంధించి ఇండియా మంచి వృద్ధిని సాధించగలదని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యంగ్ కిమ్ అభిప్రాయపడ్డారు. ఇండియా ఆర్థిక మంత్రి పి.చిదంబరం వేసిన అంచనాలకు అనుగుణం(ఈ ఏడాది 5 శాతం పైగా వృద్ధి రేటు)గా ఆర్థిక వృద్ధి పుంజుకుంటోందని పేర్కొన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ సీఈవో సదస్సు నిర్వహించిన సమావేశానికి హాజరైన జిమ్... చిదంబరం ఆశిస్తున్నట్లుగా ద్వితీయార్థంలో ఇండియా జీడీపీ మెరుగుపడుతుందని చెప్పారు.