
పరిస్థితులు మెరుగవుతున్నాయ్: పి.చిదంబరం
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5 శాతం నమోదవుతుందన్న విశ్వాసాన్ని ఆర్థిక మంత్రి పి.చిదంబరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆశావహ ధోరణిలోనే కొనసాగడానికి తగిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కరెంట్ అకౌంట్ లోటు పూర్తి కట్టడిలో ఉందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం మొత్తంలో ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగ్గా ఉంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఆయన ఆయా అంశాలపై విలేకరులతో మాట్లాడారు. క్లుప్తంగా...
వృద్ధిపై ఏమన్నారంటే...
రెండవ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) వృద్ధి రేటు క్యూ1 కన్నా (4.4 శాతం) మెరుగ్గా 4.8 శాతంగా నమోదుకావడం సంతృప్తిని ఇచ్చింది. క్యూ3, క్యూ4లో ఫలితాలు మరింత బాగుంటాయని భావిస్తున్నాం. తయారీవంటి కొన్ని కీలక రంగాల్లో ఇటీవలి మెరుగుదల, ఎగుమతుల్లో వృద్ధి ధోరణి, ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ఇందుకు దోహదపడతాయని భావిస్తున్నాం.
డిజిన్వెస్ట్‌మెంట్, ద్రవ్యలోటు
రూ.40,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుందన్న విశ్వాసం ఉంది. ఇక జీడీపీలో 4.8 శాతానికి ద్రవ్యలోటు కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలూ జరుగుతాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయాలకు సంబంధించిన ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో ఇప్పటికే 84 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) రూ.4.57 లక్షల కోట్లకు చేరినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో 4.8 శాతం వద్ద 2013-14 ద్రవ్యలోటును (రూ.5.42 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2012-13లో ద్రవ్యలోటు 4.9 శాతంగా నమోదయ్యింది. ఆందోళన కలిగించిన ఈ గణాంకాలను చిదంబరం ప్రస్తావిస్తూ, ఏదైనా నెల పూర్తయిన వెంటనే ద్రవ్యలోటు గురించి స్పష్టమైన ముఖచిత్రం వచ్చిందని భావించకూడదన్నారు. ప్రభుత్వ వ్యయం గణాంకాలు మొదటి వరుసలో కనబడుతుంటే... వసూళ్ల అంశం (గణాంకాలు) తరువాత వెళ్లడయ్యే పరిస్థితి దీనికి కారణమని వివరించారు.