
ఈ ఏడాది 5.5% వృద్ధి !
మధ్యంతర ఆర్థిక సమీక్షలో కేంద్రం అంచనా...
స్థూల ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయ్...
పన్ను వసూళ్ల మందగమనం ఇబ్బందికరం...
క్రూడ్ ధరలు దిగిరావడంతో క్యాడ్ 2 శాతానికి పరిమితం కావచ్చు...
నివేదికను పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: దేశంలో స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 5.5 శాతానికి పుంజుకోనుందని కేంద్రం తాజాగా అంచనా వేసింది. శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన ఈ ఏడాది మధ్యంతర ఆర్థిక సమీక్ష నివేదికలో ఈ అంశాన్ని పేర్కొంది. ద్రవ్యోల్బణం అనూహ్యంగా దిగొచ్చిందని.. రానున్న సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ మళ్లీ 7-8 శాతానికి ఎగబాకే అవకాశాలున్నాయని సమీక్షలో ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది వృద్ధి రేటు దశాబ్దపు కనిష్టానికి(4.7 శాతం) పడిపోయిన సంగతి తెలిసిందే.
అంతక్రితం ఏడాది కూడా 4.5 శాతానికి మందగించింది. కాగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నేలకు దిగొచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) 2 శాతానికి కట్టడి కావచ్చని నివేదిక అభిప్రాయపడింది. బంగారం దిగుమతులపై ఆంక్షలు, ఇతరత్రా చర్యల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో క్యాడ్ 1.7 శాతానికి తగ్గింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధర ఐదున్నరేళ్ల కనిష్టస్థాయిలో 60 డాలర్ల దిగువకు చేరడం(ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 50 శాతం తగ్గింది) తెలిసిందే.
పెట్టుబడులు పెరగాలి...
‘ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఇంకా గణనీయంగా పెరగాల్సి ఉంది. మరోపక్క, ద్రవ్యోల్బణం నాటకీయంగా అట్టడుగుకు దిగొచ్చింది. అయితే, పన్ను వసూళ్లు మందకొడిగా ఉండటం కాస్త ఇబ్బందికరమైన అంశమే’నని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే... అమెరికాలో వడ్డీరేట్ల పెంపు అంచనాలు, సహాయ ప్యాకేజీల ఉపసంహరణ కారణంగా భారత్ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని తెలిపింది. ప్రధానంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఇతరత్రా అంశాలు దీనికి కారణమని పేర్కొంది.
నిలిచిపోయిన ప్రాజెక్టులపై దృష్టి...
దాదాపు 18 లక్షల కోట్ల విలువైన(జీడీపీలో దాదాపు 13 శాతం) ప్రాజెక్టులు వివిధ కారణాలతో నిలిచిపోయాయని.. ఇందులో 60 శాతం వరకూ మౌలిక రంగానివేనని నివేదిక వెల్లడించింది. దీంతో కార్పొరేట్ కంపెనీల లాభదాయకత దిగజారుతోందని.. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపైపడి... మొండి బకాయిలు ఎగబాకుతున్నాయని వివరించింది.
మొత్తం రుణాల్లో కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణల వాటా 11-12 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. ‘నష్టభయం(రిస్క్) పెరిగిపోవడంతో.. రియల్ ఎస్టేట్ రంగానికి రుణాలివ్వడానికి బ్యాంకులు జంకుతున్నాయి. భవిష్యత్తులో వృద్ధి జోరందుకోవాలంటే.. ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి పట్టాలెక్కాల్సి ఉంటుంది.
వేగంగా అనుమతులు లభించాలి. ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి పెంపు(26 శాతం నుంచి 49 శాతానికి) వంటి ముఖ్యమైన సంస్కరణలతో పాటు... వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు, సబ్సిడీల కల్పనకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని మరింత విస్తృతం చేసే(ఆధార్, జనధన ఖాతాల అనుసంధానం) కీలకమైన(గేమ్ చేజింగ్) సంస్కరణలకు ప్రభుత్వం నడుంబిగించింది. రానున్నకాలంలో ఆర్థిక వ్యవస్థ జోరుకు ఇవి చేయూతనందించనున్నాయి. అయితే, రికవరీ ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది’ అని ఆర్థిక శాఖ తెలిపింది.
మార్చివరకూ వడ్డీరేట్ల కోత ఉండకపోవచ్చు...
వచ్చే ఏడాది మార్చివరకూ రిజర్వ్ బ్యాంక్ పాలసీ విధానంలో మార్పులు ఉండకపోవచ్చని.. వడ్డీరేట్ల కోతకు ఆస్కారం లేదని సమీక్షలో ఆర్థిక శాఖ అంచనా వేసింది. పారిశ్రామికోత్పత్తి తీవ్రంగా క్షీణించడం(అక్టోబర్‌లో మైనస్ 4.2 శాతం), ద్రవ్యోల్బణం దిగొచ్చిన నేపథ్యంలో(టోకు ధరల ద్రవ్యోల్బణం నవంబర్‌లో సున్నా, రిటైల్ ద్రవ్యోల్బణం 4.4 శాతం) వడ్డీరేట్లను తగ్గించాల్సిందిగా కార్పొరేట్ ఇండియా డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. వచ్చే ఐదు త్రైమాసికాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1-5.8 శాతం స్థాయిలో ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది.
కాగా, గత ఇరువురు ఆర్‌బీఐ గవర్నర్ల హయాంలో పాలసీ విధానాలపై ఆర్థిక శాఖ విమర్శలు గుప్పించింది. ‘2007-13 మధ్య కాలంలో ఆర్‌బీఐ పరపతి విధానం విశ్వసనీయతను కోల్పోయింది. అయితే, 2013 ద్వితీయార్థం నుంచి ఈ పరిస్థితి గణనీయంగా మారింది’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. మధ్యంతర ఆర్థిక సమీక్ష నివేదికను ఆయనే రూపొందించారు.
2003 సెప్టెంబర్ నుంచి 2008 సెప్టెంబర్ వరకూ వైవీ రెడ్డి ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేయగా... 2013 సెప్టెంబర్ వరకూ దువ్వూరి సుబ్బారావు బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, గతేడాది సెప్టెంబర్ 4న రఘురామ్ రాజన్ 23వ గవర్నర్‌గా నియమితుయ్యారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం కలసికట్టుగా తీసుకున్న చర్యలతో పరపతి విధానంపై విశ్వాసం పెరిగిందని నివేదిక పేర్కొంది. గత జూలై నుంచి ద్రవ్యోల్బణం కట్టడికోసం పాలసీ వడ్డీరేట్ల పెంపు ద్వారా తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకుందని అబిప్రాయపడింది. కాగా, ఈ ఏడాది ద్రవ్యలోటును జీడీపీలో 4.1 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు.