
'కాంగ్రెస్ నేతల్లా దొంగపనులు చేయం'
హైదరాబాద్: కుంభకోణాలు, దొంగ పనులు చేయడం, ప్రాజెక్టుల పేరుతో అడ్వాన్స్‌పేమెంట్లు తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకే అలవాటని వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దుయ్యబట్టారు. దేశాన్ని రాష్ట్రాన్ని దోచేసిన కాంగ్రెస్ పార్టీకి తమను విమర్శించే అర్హత లేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కోసం చిల్లర చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పురోగతిపై కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధ్ది ఉంటే వెంటనే పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వద్దకెళ్లి కర్ణాటకలో నిర్మితమవుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నారు.
మద్యం పాలసీ విషయంలో అన్ని పార్టీల నేతలు కావాలనే రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు. గుడుంబాను అరికట్టడం కోసమే ప్రభుత్వం ఛీప్‌లిక్కర్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు కొనసాగుతున్న వైనం టీడీపీ నేతలకు కనిపించడం లేదా? గుజరాత్‌లో ప్రతీ పాన్‌షాప్‌లో లిక్కర్ దొరుకుతుందనే విషయం బీజేపీ నేతలకు తెలియదా? అని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను తానే కట్టానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు, ఏడాదిన్నర పూర్తవుతున్నా ఏపీలో ఎందుకు నిర్మించలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో ప్రధాని నరేంద్రమోదీ కూడా అపాయింట్‌మెంట్ ఇచ్చి రద్దు చేశారన్నారు.