సాక్షి, హైదరాబాద్: ప్రగతి నివేదన సభలో తమని తిట్టలేదని కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నట్టున్నారని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిట్టలేదనే బాధతో కాంగ్రెస్ నేతలు నిరుత్సాహపడ్డారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేకపోతున్నారని విమర్శించారు. వాస్తవాలు చూడటానికి రాష్ట్రంలో కంటివెలుగు శిబిరాల్లో కంటి చికిత్స చేయించుకోవాలని సూచించారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బుద్ధి, జ్ఞానం ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ సభలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవడానికి నిబంధనలున్నాయనే విషయం కాంగ్రెస్ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. పొన్నాల లక్ష్మ య్యకు సొంత ఊరిలోనే పరపతి లేదన్నారు. కాంగ్రెస్ దిక్కూదివానం లేని పార్టీ అని, ఆ పార్టీ నేతలకు బుద్ధి లేదని విమర్శించారు.
లెక్కలు తేల్చుకుందామా?
మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదా, సాగుకు 24 గంటలు కరెంటు అందడం లేదో చెప్పాలని తలసాని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కాంగ్రెస్ హయాంలో ఎంతమందికి ఇచ్చారో, టీఆర్‌ఎస్ హయాంలో ఎందరికి ఇస్తున్నామో లెక్క తేల్చుకుందామా అని సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఒకేసారి చెప్పడం సాధ్యం కానన్ని ఉన్నాయన్నారు.
దళితులకు మూడెకరాల భూమి గురించి జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి సమాచారం తెప్పించుకుని చూడాలన్నారు. కేసీఆర్ హఠావో అంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందా అని ప్రశ్నించారు. వీహెచ్‌ను కాంగ్రెస్ నేతలే పట్టించుకోరని, ఆయన టీఆర్‌ఎస్‌పై విమర్శలు మానుకోవాలని సూచించారు. డబ్బు మూటలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్‌రెడ్డి నీతులు వల్లించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సభలన్నా, ఎన్నికలన్నా మీకు వణుకు..
కాంగ్రెస్ నేతలకు సభలన్నా, ముందస్తు ఎన్నికలన్నా భయమని తలసాని విమర్శించారు. ఎన్నికలు ముం దొచ్చినా, వెనుకొచ్చినా టీఆర్‌ఎస్‌దే విజయమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నేతలే బాగుపడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అనుకున్నట్టు టీఆర్‌ఎస్ పాలిస్తుందా అని ప్రశ్నిం చారు. తెలంగాణలో ప్రజల కోసమే అప్పు చేస్తున్నామని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అప్పులు చేయడం లేదని ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల గుండెల్లో ప్రగతి నివేదన సభ రైళ్లు పరిగెత్తించిందన్నారు. కమీషన్లకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సేనని తలసాని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment