ఎమ్మెల్యేల ఝలక్.. పళనిస్వామికి టెన్షన్!
ఎమ్మెల్యేల ఝలక్.. పళనిస్వామికి టెన్షన్!
Published Fri, Feb 17 2017 1:02 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
గవర్నర్ విద్యాసాగర్ రావు అవకాశం కల్పించారు.. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేశారు. అంతవరకు బాగానే ఉంది గానీ, అసెంబ్లీలో బలం నిరూపించుకునే విషయం వచ్చేసరికి మాత్రం కాస్త ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రిసార్టులో ఉన్న మొత్తం 124 మంది ఎమ్మెల్యేలు కచ్చితంగా తనకు మద్దతిస్తారన్న నమ్మకం లేకపోవడమే ఈ ఆందోళనకు కారణం. అందుకే ఆయన చిన్నమ్మ శశికళను చూసేందుకు బెంగళూరు జైలుకు వెళ్లాల్సిన పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ అయిన నటరాజ్ శుక్రవారం ఉదయమే ముందుగా పళనిస్వామికి ఝలక్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తాను అమ్మ ఫొటో పెట్టుకుని గెలిచానని, అందువల్ల అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని ఆయన చెప్పారంటున్నారు. కావాలంటే అమ్మ ఫొటోతో మరోసారి ఎన్నికలకు వెళ్తానని కూడా ఆయన తెగేసి చెప్పారని తెలుస్తోంది. ఈ ఊహించని పరిణామం కారణంగానే పళనిస్వామి బెంగళూరు వెళ్లడం మానుకుని నేరుగా రిసార్టుకు వెళ్లి అక్కడున్న ఎమ్మెల్యేలందరినీ బుజ్జగించే ప్రయత్నాల్లో పడ్డారంటున్నారు. సెంగొట్టియాన్ లాంటి వాళ్లకు మంత్రిపదవి ఇవ్వడం కూడా అమ్మ భక్తులైన కొంతమంది ఎమ్మెల్యేలలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఇంతకుముందు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఉన్న సెంగొట్టియాన్‌కు, రెండోసారి వరుసగా ఎన్నికైన జయలలిత తన కేబినెట్‌లో అవకాశం కల్పించలేదు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలే అందుకు కారణం. అలాంటి వ్యక్తికి పళనిస్వామి రెడ్‌కార్పెట్ పరవడం, శశికళ కుటుంబ సభ్యులు కూడా పార్టీ పైన, ప్రభుత్వంలోను పట్టు పెంచుకోవడం లాంటి పరిణామాలను అమ్మ భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్ల వాళ్లు ఎదురు తిరిగే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.
ఒక్క నటరాజ్ మాత్రమే కాక.. దాదాపు మరో 18 మంది వరకు ఎమ్మెల్యేలు కూడా రిసార్టులో ఎదురు తిరిగినట్లు సమాచారం. ఇదే జరిగితే పళనిస్వామి రేపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవడం దాదాపు అసాధ్యమే అవుతుంది. అయితే, నిజంగానే ఈ 18 మంది ఎదురు తిరిగి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా లేదా అన్నది మాత్రం బలపరీక్ష తర్వాతే తెలియాల్సి ఉంది. పన్నీర్ క్యాంపులో ఆయనతో కలిపి 11 మంది ఎమ్మెల్యేలున్నారు. పళనిస్వామితో కలిపి ఆ వర్గానికి 124 మంది బలం ఉంది. మేజిక్ ఫిగర్ 117. అంటే అసెంబ్లీలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలలో కనీసం 117 మంది అనుకూలంగా ఓటు వేస్తే తప్ప పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండదు. ఉన్న 124 మందిలో ఒక్క ఎనిమిది మంది అటూ ఇటూ అయినా కూడా ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో అవకాశం కూడా ఉండబోదు.
ఈ పరిణామాలన్నింటినీ ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. నిజానికి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయి ఉంటే, ఆ ప్రభుత్వాన్ని పడగొడితే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పాటు పన్నీర్‌కు సానుభూతి కూడా పెరుగుతుంది. అది రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పుడున్నది మాత్రం శశికళ వర్గీయుడైన పళనిస్వామి కాబట్టి.. ప్రజల్లో ఆ వర్గం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రభుత్వాన్ని పడగొట్టినా పెద్ద నష్టం ఉండబోదు. అన్నాడీఎంకే ఎటూ రెండు వర్గాలుగా చీలిపోతోంది కాబట్టి, రాబోయే ఎన్నికల్లో సులభంగా తాము గెలిచి రాజమార్గంలో అధికారం చేపట్టవచ్చన్నది స్టాలిన్ వ్యూహంలా కనిపిస్తోంది. ఎటూ కాంగ్రెస్ పార్టీ కూడా డీఎంకే మిత్రపక్షమే కాబట్టి వాళ్లది కూడా అదే నిర్ణయం కావచ్చు.
Advertisement
Advertisement