ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం?
తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ ఓ పన్నీర్ సెల్వం అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలీన చర్చలలో భాగంగా ప్రస్తుతానికి పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, వీలైనంత త్వరలో పళని స్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలన్న ప్రతిపాదనకు ఎక్కువ మద్దతు లభించింది. అయితే ప్రస్తుతం పార్టీకి ప్రధాన కార్యదర్శి పదవిలో శశికళ ఉన్నారు కాబట్టి, ఇప్పటికిప్పుడే పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా చేయడం కూడా సాధ్యం కాని పనే అవుతుంది. ముందుగా ఎన్నికల కమిషన్‌కు గతంలో పళనిస్వామి వర్గం తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళా నటరాజన్‌ను ఎన్నుకున్నట్లుగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఆ తర్వాత పార్టీలో అంతర్గత ఎన్నిక నిర్వహించి, అప్పుడు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలి. దీనంతటికీ ఎంత లేదన్నా రెండు నుంచి మూడు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడు పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా చేయడం కష్టమే అవుతుంది.
ఈ నేపథ్యంలో తాత్కాలికంగా పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా చేసి, పళని స్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, ఇప్పటివరకు ఉన్న మంత్రివర్గాన్ని ఇంచుమించు యథాతథంగా కొనసాగించడం లాంటి అవకాశాలను కూడా చర్చిస్తున్నారు. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. ముందుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కొంతవరకు తగ్గడం, రెండోది.. త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వర్గాలు ఒక్కటిగా కలిసిపోయి రెండాకుల గుర్తు మీద పోటీ చేయడం.. తద్వారా జయలలిత వారసత్వం పూర్తిగా తమకు ఉందన్న విషయాన్ని నిరూపించుకోవడం. ఇదే లక్ష్యంగా పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
వీలైనంత త్వరగా రెండు వర్గాల విలీనం జరిగితేనే ఇది సాధ్యమని.. ఎన్నికల కమిషన్ జూన్ 16 వరకు సమయం ఇచ్చినా ఈలోపే విలీనానికి సంబంధించిన లేఖలను కూడా ఇచ్చి, అంతా కలిసి ఒకే వర్గంగా రెండాకుల గుర్తును క్లెయిమ్ చేసుకుంటే మంచిదని కూడా భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇరు వర్గాల నాయకుల మధ్య చిన్న చిన్న విషయాలలో తప్ప చాలావరకు ఏకాభిప్రాయం కుదిరిందనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.