పన్నీర్ సెల్వం వెంట ముగ్గురేనా?
Published Wed, Feb 8 2017 12:13 PM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM
తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తాజాగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెంట ఉన్నది కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమేనన్న కథనాలు వస్తున్నాయి. మిగిలిన 130 మంది శశికళ వెంట ఉన్నారని చెబుతున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ సమావేశమైనప్పుడు మొత్తం 130 మంది ఎమ్మెల్యేలు ఆమెకు మద్దతు చెప్పారని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో ఇంకా తేలాల్సి ఉంది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కనిపించారు. అయితే ఒకవైపు పన్నీర్ సెల్వం తనకు 50-70 మంది వరకు ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని, మరికొంత సమయం ఇస్తే పూర్తిస్థాయిలో మెజారిటీ నిరూపించుకుంటానని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎవరి క్లెయిము వాస్తవం అన్నది అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే తప్ప స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 235 మంది సభ్యులుంటారు. వారిలో ఒక నామినేటెడ్ సభ్యుడిని తీసేసి, జయలలిత మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని కూడా మినహాయిస్తే మొత్తం 233 మంది అవుతారు. అప్పుడు మేజిక్ ఫిగర్ 117 అవుతుంది. అన్నాడీఎంకేకు సభలో మొత్తం 135 మంది సభ్యులున్నారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం, ఆయన వెంట ఉన్న ముగ్గురు కలుపుకొంటే మిగిలిన 131 మంది శశికళ వెంటే ఉన్నారా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. తనతో ఎవరొస్తారన్న విషయం ముందుగా చూసుకోకుండానే అత్యంత విధేయుడిగా ఉండే పన్నీర్ సెల్వం ఇంత ధైర్యం చేస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మైత్రేయన్ లాంటి సీనియర్ మోస్ట్ పార్లమెంటు సభ్యులు, పాండియన్ లాంటి పార్టీ వ్యవస్థాపక సభ్యులు ప్రస్తుతం బహిరంగంగా పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. అయితే, అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటే ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాబట్టి... ఇప్పుడు ఏం జరుగుతుందన్న విషయాన్ని వేచిచూడాల్సిందే.
Advertisement