
అపోలో నుంచి వెళ్లిపోయిన మంత్రులు..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందిస్తోన్న అపోలో ఆసుపత్రి నుంచి ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం సహా ఇతర మంత్రులు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. సోమవారం మధ్యాహ్నం నుంచి అపోలో ఆసుపత్రిలోనే పలు దఫాలుగా చర్చలు జరిపిన మంత్రులు.. అర్ధరాత్రి తర్వాత కూడా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రులు, ఏఐడీఎంకేకి చెందిన ఇతర ముఖ్యులంతా సెంట్రల చెన్నై(ఆజాద్ నగర్)లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తమిళనాడు భవిష్యత్తుకు సంబంధించిన కీలక ప్రకటన ఇక్కడి నుంచే వెలువడుతుందని తాజా సమాచారం
ఆసుపత్రిలో వరుస సమావేశాల అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చిన పన్నీర్ సెల్వంను చూసి అప్పటికే గుమ్మిగూడిన అమ్మ అభిమానులు బోరున విలపించారు. ‘అయ్యా.. అమ్మ ఎలా ఉంది.. చెప్పయ్యా..’ అంటూ పెద్ద పెట్టున రోదించారు. మంత్రి పన్నీర్ సెల్వం విషణ్నవదనంతోనే కార్యాలయంలోనికి వడివడిగా నడుచివెళ్లారు. ఇప్పటికే జయ వారసుడు ఎవరనేదానిపై ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఒక అభిప్రాయానికి వచ్చారని, మరికాసేపట్లో పన్నీర్ సెల్వమే ఆ విషయాన్ని వెల్లడిస్తారని చెన్నైలోని ‘సాక్షి’ ప్రతినిధులు తెలిపారు.