మహిళలకు టాటా ప్రత్యేక హోమ్‌లోన్
ముంబై: టాటా క్యాపిటల్ సంస్థ మహిళల కోసం తక్కువ వడ్డీ రేటుకే రుణాలను ఆఫర్ చేస్తోంది. ఎస్‌బీఐ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థల మాదిరి టాటా క్యాపిటల్ కూడా ఈ తరహా రుణాలను అందిస్తోంది. మహిళలకు రూ.40 లక్షల లోపు రుణాలను 10.15 శాతానికే అందిస్తామని కంపెనీ పేర్కొంది. గతంలో ఈ వడ్డీరేటు 10.50 శాతంగా ఉండేదని పేర్కొంది.
ఈ పథకం అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన వచ్చే నెల 8 వరకూ అందుబాటులో ఉంటుందని వివరించింది. మహిళలు తాము కలలు గన్న ఇంటిని సొంతం చేసుకోవడం ద్వారా మహిళల ఆర్థిక సాధికారితకు తోడ్పడం తమ లక్ష్యమని కంపెనీ పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు గృహ రుణాలు 10.10% వడ్డీకే అందిస్తోంది. ఇక ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మహిళల కోసం ప్రత్యేక గృహరుణ పథకాన్ని ఆఫర్ చేస్తోంది.