ఇదిగో బండ బూతుల.. బండారం!
► 18 ఏళ్లకే డిగ్రీ పట్టా ఎలా వచ్చిందో?
► డిగ్రీయే ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటెందుకు లేదు
► సోషల్ మీడియాలో విమర్శల హోరు
► తన వైపు తప్పులుంచుకొని ఎదుటివారిపై అవాకులు చవాకులు
► టీడీపీ ఎమ్మెల్యే బండారు జుగుప్సాకర వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన
గురివింద గింజ తన నలుపును మరిచి ఇతరులను వెక్కిరిస్తుందట!.. ఘనత వహించిన పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీరు ఈ గురువింద సామెతనే గుర్తు చేస్తోంది. తన వెనుక వంద తప్పులు పెట్టుకొని.. వాటిని ఎత్తి చూపినవారిపై విరుచుకుపడుతున్నారు.
బాధ్యత గల ప్రజాప్రతినిధినన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా.. సహనం, సభ్యత కోల్పోయి.. విచక్షణ మరిచి ప్రతిపక్ష నేతలపై అసభ్య పదజాలం రువ్వుతున్నారు.. తానేదో పత్తిత్తునన్నట్లు ఫోజులు కొడుతున్నా.. ఆయన వాడుతున్న పదజాలమే ఆయనగారిలోని సంస్కారం పాలెంతో చెప్పకనే చెబుతోంది.. ఇదే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. పనిలోపనిగా ఎమ్మెల్యేగారి విద్యార్హతల బండారం కూడా ఈ మాధ్యమాల్లో బట్టబయలైంది.
పత్రికల్లో రాయలేని భాష.. దుర్భాషకు మించి జుగుప్సాకరమైన రీతిలో.. పిచ్చి వాగుడుతో సొంత పార్టీ నేతలకే ఏవగింపు కలిగిస్తున్న మాజీ మంత్రివర్యుడు బండారు సత్యనారాయణమూర్తి విద్యార్హతల లోగుట్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. భూ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండారుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా వామపక్ష పార్టీల నేతలు విమర్శలు చేశారు.
స్వయంగా తెలుగుదేశం పార్టీకే చెందిన సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు కూడా బండారు ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి నియోజకవర్గంలోని ముదపాక గ్రామంలో జరిగిన ల్యాండ్ ఫూలింగ్ కుంభకోణంపై పలుమార్లు విమర్శలు సంధించారు. కానీ బండారువారు మాత్రం వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి; ఎంపీ విజయసాయిరెడ్డినే టార్గెట్ చేసుకుని గురువారం కువిమర్శలు దిగారు. నోటికొచ్చినట్టు పేట్రేగిపోయారు. అధికారమదంతో ఆయన చేసిన విమర్శలు, వ్యాఖ్యలపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
18 ఏళ్లకే పట్టా పుచ్చుకున్నారట!
కాగా, బండబూతుల బండారు విద్యార్హతకు సంబంధించి శుక్రవారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సర్టిఫికెట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. 2014 ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో అనకాపల్లి ఎ.ఎం.ఎ.ఎల్ కళాశాల నుంచి 1978లో బీకాం డిగ్రీ పట్టా పొందినట్టు బండారు పేర్కొన్నారు. అదే అఫిడవిట్‌లో తన వయస్సు 54 ఏళ్లుగా పేర్కొన్నారు. ఈ లెక్కన ఆయన 1960లో పుట్టారన్నమాట. మరి 1978లోనే.. అంటే 18 ఏళ్లకే డిగ్రీ పట్టా ఎలా అందుకున్నారన్నదే ఇప్పుడు ప్రశ్న.
పూర్వకాలంలో ఐదేళ్ల వయసు వచ్చిన తర్వాతే స్కూళ్లలో జాయిన్ చేసేవారు. ఆ ప్రకారం చూసుకుంటే సాధారణంగా ఎవరైనా 15–16 ఏళ్ల వయసులో పదో తరగతి, 17–18 ఏళ్లకు ఇంటర్ పూర్తి చేస్తారు. కానీ మన బండారు వారు మాత్రం ఇంటర్ పూర్తి చేసే వయసుకే డిగ్రీ పట్టా అందేసుకున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారంటే దాన్ని ఏమనుకోవాలి?.. ఇక ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓటు కూడా వేయలేదు. ఇదే విషయాన్ని ఆ సందర్భంలో విలేకరులు అడిగితే.. ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు.
ఇప్పు డు బయటపడిన సర్టిఫికెట్ల బండారం చూస్తుంటే.. ఆయన ఎన్నికల సమయంలో డిగ్రీ ఉందని తప్పుడు పత్రాలు సమర్పించినట్టు అర్థమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యార్హత మొదలు తప్పుడు లెక్కలు చూపించిన బండారు రాజకీయ జీవితంలో ఎంతో అప్రతిష్ట ను, అపకీర్తిని మూటగట్టుకున్నారు. వీట న్నింటినీ విస్మరించి తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన భూకబ్జాలపై బాధితుల పక్షాన మాట్లాడినందు కు ఆయన రెచ్చిపోయిన తీరు.. చేసిన వ్యాఖ్యలు.. వ్యవహారశైలి అందరికీ ఏవగింపు కలిగిస్తున్నాయి.