వెలగపూడి వైరస్‌: పేదల ఫుడ్‌ కోర్టుపై ‘పడగ’ | TDP MLA Velagapudi Ramakrishna Babu Followers Occupied Food Court | Sakshi
Sakshi News home page

వెలగపూడి వైరస్‌: పేదల ఫుడ్‌ కోర్టుపై ‘పడగ’

Published Sun, Apr 25 2021 10:05 AM | Last Updated on Sun, Apr 25 2021 1:29 PM

TDP MLA Velagapudi Ramakrishna Babu Followers Occupied Food Court - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు... ఈయన గారి నేర చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. వంగవీటి మోహన రంగా హత్య కేసులో నిందితుడుగా పరారై ఇక్కడకు వలస వచ్చిన దరిమిలా విశాఖ నగరంలో విష సంస్కృతికి బీజం వేసిన ప్రబుద్ధుడీయన. కోడి పందేలు.. దౌర్జన్యాలు.. మద్యం మాఫియా ఆగడాలు, భూ దందాలు.. అక్రమార్జన.. ఇలా విశాఖకు మునుపెన్నడూ ఎరగని నయా మాఫియాకు తెరలేపిన ’పచ్చ’ నేత ఈయన.  దాదాపు పదిహేనేళ్లుగా తూర్పు నియోజకవర్గాన్ని చెరబట్టిన ఈయన గారి నిర్వాకాలకు, దందాలకు గత రెండేళ్లుగా బ్రేక్‌ పడుతూ వస్తోంది.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వెలగపూడి బ్యాచ్‌ భూదందాలు, కోడిపందాలు, మద్యం మాఫియాకు దాదాపు అడ్డుకట్టపడిందనే చెప్పాలి. అయితే అక్రమార్జన అలవాటుపడిన సదరు వెలగపూడి బ్యాచ్‌ చివరికి చిరు వ్యాపారుల ఫుడ్‌ కోర్ట్‌పై కూడా పడిపోయారు. నగరమంతటా కోవిడ్‌ వైరస్‌ కలకలం సృష్టిస్తుంటే.. నైట్‌ఫుడ్‌ కోర్టులో మాత్రం వెలగపూడి వైరస్‌ ప్రబలింది. ఇంతకీ.. ఆ వైరస్‌ ఏంటి.. నైట్‌ఫుడ్‌ కోర్టులో అసలేం జరుగుతోందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి రండి.

మహా నగర పరిధిలోని స్ట్రీట్‌ ఫుడ్‌ వెండర్స్‌ కోసం జీవీఎంసీ 2019 ఫిబ్రవరిలో జైల్‌ రోడ్డులో 27 ఫుడ్‌ స్టాల్స్‌తో నైట్‌ ఫుడ్‌ కోర్టు ప్రారంభించింది. ఆ తర్వాత క్రాఫ్ట్‌ బజార్‌ కూడా ఇందులో ప్రారంభించాలని అధికారులు భావించారు. అయితే.. అదే ఏడాది మార్చి నుంచి కరోనా కలకలం మొదలవ్వడంతో లాక్‌డౌన్‌తో కొన్నాళ్లు వ్యాపారాలు మూతపడ్డాయి. పర్యవేక్షించాల్సిన జీవీఎంసీ అధికారులంతా కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో 24‘‘7 బిజీగా అయిపోయారు. గతేడాది మే నుంచి నుంచి నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నప్పటికీ.. వైరస్‌ వ్యాప్తి చెందకుండా నగర ప్రజల్ని కాపాడే బాధ్యతని జీవీఎంసీ భుజానికెత్తుకొని.. నైట్‌ ఫుడ్‌ కోర్టు విషయాన్ని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అన్ని వ్యాపారాల మాదిరిగానే ఫుడ్‌ కోర్టు కూడా మొదలైంది. ఇదే అదనుగా ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఫుడ్‌కోర్టుని ఆక్రమించేశారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలో పచ్చజెండా పాతేశారు.

అనుమతి 27 స్టాల్స్‌కి.. ఉన్నవి 138 
అప్పటివరకు ఎంవీపీ కాలనీ, బీచ్‌రోడ్డులో స్ట్రీట్‌ఫుడ్‌ దందా సాగిస్తున్న వెలగపూడి బ్యాచ్‌ జైల్‌రోడ్డులోని నైట్‌ఫుడ్‌ కోర్టుని ఆక్రమించేసింది. వెలగపూడి తన అనుచరుల ద్వారా ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేయించేశారు. అక్కడితో ఆగకుండా మహారాష్ట్ర, ఒడిశా, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు ఇలా.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారికీ స్టాల్స్‌ పెట్టుకోడానికి వాళ్లే సొంత అనుమతులిచ్చేశారు. వీరిని చూసి.. మిగిలిన మరికొందరు సైతం తమకు నచ్చినట్లుగా ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకురాకుండానే ఓ రకంగా. మొత్తం ఫుడ్‌ కోర్టుని తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. మొత్తం 27 స్టాల్స్‌కు మాత్రమే అనుమతులుండగా ప్రస్తుతం 138 వరకూ వచ్చేశాయి. ఇందులో సగానికి పైగా వెలగపూడి అనుచరులకు చెందిన ఫుడ్‌ స్టాల్స్‌ ఉన్నాయని అంటున్నారు. ఒక్కొక్కరూ తమ బంధువుల పేరుతోనే నాలుగైదు స్టాల్స్‌ ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారుల్ని మాత్రం వాటి దరి చేరకుండా తమ గుప్పిట్లోకి తీసేసుకున్నారు.

జీవీఎంసీలో పెండింగ్‌లో 500 దరఖాస్తులు 
ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మంచి స్పందన రావడంతో నగరంలోని వివిధ స్ట్రీట్‌ ఫుడ్‌ వెండర్స్‌ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 500కి పైగా దరఖాస్తులు వచ్చాయని యూసీడీ విభాగాధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్న 27 మందికి మాత్రమే ఇప్పటివరకు ఫుడ్‌ కోర్టులో స్టాల్స్‌ పెట్టుకోవాలని తాత్కాలిక అనుమతి ఇచ్చామనీ.. ఇంకెవ్వరినీ అనుమతించలేదని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్‌ పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాతే ఫుడ్‌ కోర్టు విషయమై ఏం చేయాలో ఆలోచిస్తామని అధికారులు అంటున్నారు. 

స్టాల్‌ స్టాల్‌కీ.. వసూళ్ల పర్వం 
జీవీఎంసీ తమ ఆదాయ వనరుగా నైట్‌ ఫుడ్‌ కోర్టుని ఏర్పాటు చేస్తే.. వెలగపూడి బ్యాచ్‌ దాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఇక్కడ స్టాల్‌ ఏర్పాటు చేయాలంటే లక్ష నుంచి రెండు లక్షల రూపాయిల వరకూ వసూలు చేశారు. పోనీ.. జీవీఎంసీకి వీటి వల్ల ఆదాయం వస్తుందా అంటే.. ఇప్పటివరకూ నైట్‌ ఫుడ్‌ కోర్టు నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదని అధికారులే చెబుతున్నారు. మొదట అధికారికంగా ఏర్పాటు చేసిన 27 స్టాల్స్‌ నుంచి కూడా ఫీజు వసూలు చేయలేదనీ.. కరోనా కారణంగా మినహాయింపునిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

చిరు వ్యాపారులను తొక్కేసి.. 
రోడ్లపై చిరుతిళ్లు అమ్ముతూ బతుకులీడ్చుతున్న నగరానికి చెందిన చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఫుడ్‌ స్టాల్‌ చివరికి బడా వ్యాపారస్తుల కేంద్రంగా మారిపోయింది. ఆ ఫుడ్‌కోర్టులోకి అడుగు పెడితే కొన్ని స్టాళ్లలో పెద్ద హోటల్స్‌తో పోటీగా ధరలుంటాయి. మొత్తంగా ఫుడ్‌ కోర్ట్‌ ఏర్పాటు సదుద్దేశ్యాన్ని పక్కదారి పట్టించి... చిరు వ్యాపారులను మింగేసిన పచ్చ రాబందులపై జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా దృష్టిసారిస్తారో లేదో చూడాలి.

చదవండి: టీడీపీ నేతకు షాక్‌: అక్రమ నిర్మాణం కూల్చివేత..    
నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement