ముందుంది మంచి టెక్నాలజీ...
సాక్షి: ఇది టెక్నాలజీ యుగం. రోజుకో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచానికి అందుబాటులోకి వస్తోంది. మానవ జీవితాలన్నీ సాంకేతికమయమైపోతున్నాయి. టెక్నాలజీ విషయంలో దశాబ్దకాలంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంతటి అభివృద్ధిని బహుశా ఎవరూ ఊహించి ఉండరేమో. ఎలక్ట్రానిక్స్, హెల్త్, ఆటోమొబైల్, ఇంటర్నెట్, ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా ఏ రంగంలో చూసినా ఈ అభివృద్ధి కనిపిస్తోంది. భవిష్యత్‌లో సాంకేతికత మరింత వేగంగా దూసుకుపోనుంది. ఊహకందని టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించబోతుంది. ఈ నేపథ్యంలో త్వరలో అందుబాటులోకి వచ్చి అందరికీ ఉపయోగపడే కొన్ని సాంకేతిక పరికరాల గురించి తెలుసుకుందాం..
3డీ ప్రింటర్...
ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న అద్భుత సాంకేతిక పరికరం 3డీ ప్రింటర్. ఇది కూడా బహుళ ప్రయోజనకారి. ఏదైనా ఒక వస్తువును 3 డెమైన్షనల్‌గా తయారు చేయడానికి 3డీ ప్రింటింగ్ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. దీని ద్వారా కావాల్సిన వస్తువు నిజరూపాన్ని పోలిన వస్తువును రూపొందించవచ్చు. అనేక రంగాల్లో 3డీ ప్రింటింగ్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. వైమానిక, ఆటోమొబైల్, హెల్త్, ఆర్కిటెక్చర్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా చాలా రంగాల్లో 3డీ ప్రింటింగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ విధానంలో 3డీ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (సీఏడీ) సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, ప్రత్యేకంగా రూపొందించిన పరికరం ద్వారా కావాల్సిన వస్తువు రూపాన్ని తయారు చేస్తారు. భవిష్యత్‌లో అనేక వస్తువులను దీని ద్వారానే తయారు చేసే అవకాశం ఉంది.
ఆక్యులస్ రిఫ్ట్..
ఇది వీడియో గేమ్స్‌ని ఇష్టపడేవారికి చాలా ఉపయోగకరమైంది. ఇది ఓ 3డీ హెడ్‌సెట్ విత్ స్క్రీన్ కలిగిన పరికరం. దీన్ని ధరించి వీడియోగేమ్స్ ఆడితే ఆ గేమ్‌లో మీరూ ఓ భాగమైనట్లుగా అనుభూతి చెందుతారు. కళ్లముందు ఓ కొత్త ప్రపంచం ఉన్నట్లు భావిస్తారు. ఇలాంటి పరికరాలు మార్కెట్లో చాలా ఉన్నప్పటికీ ఆక్యులస్ రిఫ్ట్ మరింత ఉత్తమంగా పనిచేస్తుంది. తర్వాతి తరం వీడియోగేమ్‌లకు ఈ పరికరం ఓ ప్రారంభంగా నిపుణులు భావిస్తారు.
లీప్ మోషన్..
ఇది ఎలక్ట్రానిక్ పరికరం. ఇప్పటికే అనేక డెస్క్‌టాప్ టచ్ డివెజైస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మెబైల్ ఫోన్‌లాంటి చిన్న పరికరాలను చేతిలో పట్టుకుని టచ్ చేస్తూ వినియోగించవచ్చు. కానీ అలా డెస్క్‌టాప్‌లను వినియోగించాలంటే చేతికి ఎంతో శ్రమ. అయితే ఈ లీప్ మోషన్ టెక్నాలజీతో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. కేవలం వేళ్ల ద్వారా, స్క్రీన్‌ను టచ్ చేయకుండానే డెస్క్‌టాప్‌ను వినియోగించవచ్చు. కావాల్సిన వెబ్ పేజ్‌ను బ్రౌజ్ చేసేందుకు, జూమ్ సహా అనేక పనులు చేయవచ్చు. ఇప్పుడు పరిమిత స్థాయిలో డెస్క్‌టాప్‌పైన మాత్రమే అందుబాటులో ఉన్న లీప్ మోషన్ భవిష్యత్‌లో ఇతర స్క్రీన్ పరికరాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.
గూగుల్ గ్లాస్..
ఇది ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైంది. అయితే పూర్తి స్థాయిలో అందరికీ చేరువకాలేకపోయింది. కానీ ఇది భవిష్యత్‌లో బాగా ప్రాచుర్యం పొందే వీలుంది. గూగుల్‌గ్లాస్‌తో అనేక ప్రయోజనాలున్నాయి. దీనిలో ఉన్న ఫీచర్లతో కంటిముందే ప్రపంచాన్ని దర్శించొచ్చు. కళ్లద్దాల్లాగే ఉన్నప్పటికీ ఇది వీడియోలు చూడడానికి, సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లను వినియోగించేందుకు, గూగుల్ మ్యాప్స్, టెక్ట్స్ మెసేజెస్, జీపీఎస్, మెయిల్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఫొటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు. ఇతర అనేక ఫీచర్లతో భవిష్యత్‌లో మరింతగా ఆకట్టుకునే వీలుంది.
ఐ ట్రైబ్..
ఇది స్క్రీన్ డివెజైస్‌కు సంబంధించిన సాంకేతికత. కళ్ల కదలికలతోనే స్క్రీన్ పరికరాల్ని ఆపరేట్ చేయగలిగే సాంకేతిక పరిజ్ఞానం ఇది. ఎప్పుడో 2013లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా వినియోగదారుల విశ్వాసం పొందడానికి ఇంకా సమయం పడుతుంది. అలాగే ఇతర సాంకేతిక అవరోధాల్ని కూడా అధిగమించాల్సి ఉంటుంది.
డ్రైవర్‌లెస్ కార్...
ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థ ఇప్పటికే డ్రైవర్‌లెస్ కారును రూపొందించింది. కానీ ఇది కూడా అనేక అవరోధాల్ని ఎదుర్కొంది. సాంకేతికంగా దీని వినియోగంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. డ్రైవర్ లేకుండానే నడిచే ఇది అంత సురక్షితం కాదని పలువురు నిపుణులు అంటున్నారు. ఈ కార్ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. గూగుల్‌తో సహా ఇతర సంస్థలు కూడా డ్రైవర్ రహిత కారును రూపొందించేందుకు యత్నిస్తున్నాయి. ఇలాంటి కార్లు ప్రయోగాత్మకంగా విజయం సాధించినప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. కానీ ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడున్న అవరోధాల్ని అధిగమించి భవిష్యత్‌లో ప్రజాదరణ పొందే అవకాశాలున్నాయి.