భవిష్యత్ అంతా బిగ్ డేటాదే!
చీరాల: నేటి సాంకేతిక రంగం ఇంకా అనేక రెట్లు పుంజుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం ఉన్న సర్వర్లు భవిష్యత్తును అందుకునే విధంగా లేవు. రానున్న రోజుల్లో బిగ్ డేటానే అందరికీ ప్రామాణికంతో పాటు ఒక ఆధారం అవుతుం ది’ అని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాజ్‌కుమార్ బుయ్య పేర్కొన్నారు. ‘బిగ్‌డేటా ఎనలిటిక్స్, కంప్యూటీషనల్ ఇంటిలిజెన్స్’ అనే అంశంపై చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభించారు.
కళాశాలల సెక్రటరీ తేళ్ల అశోక్‌కుమార్, ప్రిన్సిపాల్ సయ్యద్ కమాలుద్దీన్‌ల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సును ఇంటిలిజెన్స్ సొసైటీలో భాగమైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఐఈఈఈ) ఆధ్వర్యంలో నిర్వహించారు. మూడు రోజుల పాటుగా నిర్వహిస్తున్న సదస్సులో బుయ్య మాట్లాడుతూ ఆధార్‌కార్డులు, డేటా సర్వర్లు బిగ్ డేటాకు అవసరమన్నారు. ప్రస్తుతం పెద్ద డేటాను కంప్యూటర్ సర్వర్‌లో నిక్షిప్తం చేయడం సాధ్యపడదని తెలిపారు.
క్యాన్సర్ డేటా బేసిస్, రక్తదాతల వివరాలు, ఇతర స్వచ్ఛంద సంస్థల వివరాలు పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలును ఆపకుండా ఉద్యోగాలకు వెళ్లినప్పటికీ కొంత సమయంలో వాటికి అవే ఆగిపోయే విధంగా బిగ్ డేటా ద్వారా చేయవచ్చన్నారు. ఐబీఎం కంపెనీ బెంగళూరు ఫ్రొఫెసర్ కె.శ్రీకాంత్ మాట్లాడుతు ఐబీఎం ఆధ్వర్యంలో మార్చి 7న క్వాంటమ్ కంప్యూటర్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. కొన్ని కంప్యూటర్లకు ఒక క్వాంటమ్ కంప్యూటర్ సమానమన్నారు. లండన్‌లోని మాన్‌చెస్టర్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ అన్‌బెల్ లాంతమ్.. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాముఖ్యతను గురించి వివరించారు.
అశోక్‌కుమార్ మాట్లాడుతు దేశంలోని అందరి వివరాలు ఒకే చోట పొందుపరిచే క్రమంలో భాగంగా చీరాల ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ విదేశాల్లోని ప్రముఖ విశ్వ విద్యాలయాల నుంచి ప్రసిద్ధ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాఫ్ట్‌వేర్ రంగంలోని నిపుణులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. 186 పరిశోధనలను ప్రదర్శనకు ఎంపిక అయ్యాయి. రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ ఏకే సింగ్, ఎస్‌కె.నిరంజన్, వివిధ విభాగాల అధిపతులు, యూనివర్సీటీల ఫ్రొఫెసర్లు పాల్గొన్నారు.