టీ బిల్లు ఆర్థిక బిల్లే..
అటార్నీ జనరల్ స్పష్టీకరణ
క్లాజ్ 67లో సంచిత నిధి ప్రస్తావన ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013ను ఆర్థిక బిల్లుగానే పరిగణించాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి అభిప్రాయపడ్డారు. సంచిత నిధి ప్రస్తావన ఉంది కాబట్టి ఈ బిల్లు ఆర్థిక బిల్లు నిర్వచనం పరిధిలోకే వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. రాజ్యాంగంలోని అధికరణ 110లో ఆర్థిక బిల్లు అంటే ఏమిటో స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతించిన విషయం తెలిసిందే. అరుుతే ఈ బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు వీల్లేదని, బిల్లు ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంది కాబట్టి తొలుత లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలనే వాదన మొదలైంది. దీంతో రాజ్యసభ చైర్మన్ న్యాయసలహా కోరారు. బిల్లును పరిశీలించిన అటార్నీ జనరల్ ఆ బిల్లు ఆర్థిక బిల్లేనంటూ అధికరణ 110 గురించి మంగళవారం రాజ్యసభ చైర్మన్‌కు వివరించారు. అధికరణ 110 ప్రకారం ఆర్థిక బిల్లంటే...
ఈ కింది అంశాల్లో ఏది బిల్లులో ఉన్నా అది ఆర్థిక బిల్లే అవుతుంది
- ఎ. ఏదైనా పన్ను విధింపు, మినహాయింపు, రద్దు, మార్పు, నియంత్రణ
- బి. డబ్బు తీసుకునే విషయంలో నియంత్రణ లేదా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం, ఏదైనా ఆర్థికపరమైన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం లేదా ఇవ్వబోవడం.
- సి. సంచిత లేదా ఆగంతుక నిధి కస్టడీ. అటువంటి నిధులకు డబ్బు ఇవ్వడం లేదా వాటి నుంచి డబ్బు ఉపసంహరించడం.
- డి. సంచిత నిధి నుంచి డబ్బులు వినియోగించడం.
- ఇ. సంచిత నిధి నుంచి డబ్బులు ఖర్చు చేయడం లేదా ఖర్చు చేసే మొత్తాన్ని పెంచడం.
-
విభజన బిల్లులోని క్లాజ్ 67లో రాష్ట్ర ఏర్పాటు కోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని సంచిత నిధి నుంచి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. సంచిత నిధి ప్రస్తావన ఉంది కాబట్టి పునర్విభజన బిల్లును ఆర్థిక బిల్లుగానే పరిగణించాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు.