Financial Bill
-
బడ్జెట్ సమావేశాల్లో 38 బిల్లులు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 38 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో కేంద్ర బడ్జెట్ సహా ఐదు ఫైనాన్స్ బిల్లులు ఉన్నాయి. నాలుగు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ప్రతిపాదించనుంది. అలాగే 3 చట్టాల ఉపసంహరణకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి. శాసన సంబంధిత బిల్లులు 1. నేషనల్ క్యాపిటల్ రీజియన్, సమీప ప్రాంతాల వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ బిల్లు–2021 (ఆర్డినెన్స్ స్థానంలో.) 2. మధ్యవర్తిత్వం, సయోధ్య (సవరణ) బిల్లు, 2021 (ఆర్డినెన్స్ స్థానంలో) 3. జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లు, 2021 (ఆర్డినెన్స్ స్థానంలో) 4. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2021 ( ఆర్డినెన్స్ స్థానంలో) 5. డీఎన్ఏ టెక్నాలజీ (యూజ్ అండ్ అప్లికేషన్) రెగ్యులేషన్ బిల్లు, 2019. 6. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం (సవరణ) బిల్లు, 2019 7. ది ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు, 2020 8. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ బిల్లు, 2019 9. సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు, 2019 10. లోక్‌సభ ఆమోదించిన ఆనకట్ట భద్రతా బిల్లు, 2019. 11. లోక్‌సభ ఆమోదించిన మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు, 2020 12. పురుగుమందుల యాజమాన్య బిల్లు, 2020 13. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ బిల్లు, 2020 14. లోక్‌సభ ఆమోదించిన 2020 మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) బిల్లు. 15. గనుల (సవరణ) బిల్లు, 2011 (ఉపసంహరణ కోసం) 16. అంతర్రాష్ట్ర వలస కార్మికుల (ఉపాధి నియంత్రణ, సేవా నిబంధనలు) సవరణ బిల్లు, 2011 (ఉపసంహరణ కోసం) 17. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంబంధిత చట్టాలు (సవరణ) బిల్లు, 2013 (ఉపసంహరణ కోసం) 18. ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజెస్∙(ఖాళీల తప్పనిసరి నోటిఫికేషన్) సవరణ బిల్లు, 2013 (ఉపసంహరణ కోసం) 19. మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు, 2021 20. నేషనల్ ఇన్సి్టట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (సవరణ) బిల్లు, 2021 21. చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు (సవరణ) బిల్లు, 2021 22. కాంపిటిషన్ (సవరణ) బిల్లు, 2021 23. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, 2021 24. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) బిల్లు, 2021 25. క్రిప్టోకరెన్సీ, డిజిటల్ కరెన్సీ రెగ్యులేషన్ బిల్లు 2021 26. జాతీయ రాజధాని భూభాగం ఢిల్లీ బిల్లు, 2021 27. మెట్రో రైలు (నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ) బిల్లు, 2021 28. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, 2021 29. విద్యుత్ (సవరణ) బిల్లు, 2021 30. మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్లు, 2021 31. ఇన్లాండ్ వెసల్స్ బిల్లు, 2021 32. మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం, పునరావాస సవరణ బిల్లు, 2021 33. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) సవరణ బిల్లు, 2021 ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన బిల్లులు 1. ఆర్థిక బిల్లు, 2021 2. 2020–21 నిధుల కోసం అనుబంధ డిమాండ్లపై అప్రొప్రియేషన్ బిల్లు 3. 2021–22 నిధుల డిమాండ్లపై చర్చ, ఓటింగ్, సంబంధిత అప్రొప్రియేషన్ బిల్లు 4. 2020–21 ఆర్థిక సంవత్సరానికి జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల నిధుల కోసం అప్రొప్రియేషన్ బిల్లు 5. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల నిధుల కోసం అప్రొప్రియేషన్ బిల్లు -
మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు కూడా కాకముందే బీజేపీ జోరుపెంచింది. కాంగ్రెస్ నేత, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బీజేపీ తరఫు ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని నేరుగా స్పీకర్‌కు చేరవేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘రమేశ్ కుమార్ స్వచ్ఛందంగా తప్పుకోకుంటే ఆయనపై అవిశ్వాసం పెట్టక తప్పదు. అయితే మా తొలిప్రాధాన్యం సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడం, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడమే. ఇది పూర్తయ్యాక స్పీకర్ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి లబ్ధి చేకూర్చేలా స్పీకర్ వ్యవహరించవచ్చన్న అనుమానంతోనే బీజేపీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు యడియూరప్ప ప్రభుత్వానికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ చెప్పారు. అనర్హతపై రెబెల్స్ న్యాయపోరాటం.. స్పీకర్ అనర్హతవేటు వేసిన నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుతో పాటు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని ఎమ్మెల్యేలు రమే శ్ జార్కిహోళి, మహేశ్ కుమటహళ్లి, శంకర్లు నిర్ణయించారు. సుప్రీంలో రమేశ్, మహేశ్‌ల పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తీసుకోకుండా అనర్హులను చేయడంపై వీరిద్దరూ అఫిడవిట్లు దాఖలు చేస్తారని సమాచారం. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌ను కాంగ్రెస్ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్ అనర్హతవేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ సోమవారం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఫిరాయింపుల చట్టం కింద వేటువేయడం కుదరదని శంకర్ చెబుతున్నారు. తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినప్పటికీ, 6 నెలల్లోపు జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు సుప్రీంకోర్టు, ఈసీ అనుమతించిన విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ ముగిసేవరకూ (2023) అనర్హత వేటేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులు కోర్టులో నిలబడవని స్పష్టం చేస్తున్నారు. -
నిరసనల మధ్యే బిల్లులు ఆమోదం
న్యూఢిల్లీ: వరుసగా తొమ్మిదో రోజు కూడా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగడంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే పార్లమెంటు ఉభయసభలు శుక్రవారానికి వాయిదాపడ్డాయి. అయితే విపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో రెండు బిల్లుల్ని ఆమోదించారు. ఇక రాజ్యసభలో ఆర్థిక బిల్లు, వినిమయ బిల్లుల్ని చర్చకు చేపట్టాలని ప్రయత్నించినా.. ప్రతిపక్షాల గందరగోళంతో సభ ముందుకు సాగలేదు. బ్యాంకింగ్ కుంభకోణంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు కాంగ్రెస్, తృణమూల్ సహా ఇతర పార్టీలు పట్టుబట్టగా, ఏపీ ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు ఆందోళన కొనసాగించాయి. రిజర్వేషన్ల కోటా పెంచాలంటూ టీఆర్ఎస్, కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటు కోసం అన్నాడీఎంకేలు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపాయి. నిరసనల మధ్యే లోక్‌సభలో గ్రాట్యుటీ చెల్లింపుల(సవరణ) బిల్లు, ప్రత్యేక పరిహార(సవరణ) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పార్టీల నిరసనల హోరు మధ్య చర్చ జరిగే అవకాశం లేనందున మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అంతకుముందు ఉదయం గ్రాట్యుటీ చెల్లింపుల బిల్లును కార్మిక శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్ ప్రవేశపెడుతూ.. ఈ బిల్లు ముఖ్యంగా మహిళలతో పాటు ఉద్యోగులందరికీ చాలా ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రసూతీ సెలవుల్ని కూడా ఉద్యోగి సర్వీసు కాలంలో భాగంగానే ఈ బిల్లు పరిగణిస్తుంది. గ్రాట్యుటీ అవసరమైనప్పుడల్లా చట్ట సవరణ చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఒక సంస్థలో పనిచేసి రిటైరయ్యే లేదా వైదొలిగే వారు పొందే గ్రాట్యుటీపై రూ.20లక్షల వరకు పన్ను ఉండదు. ప్రస్తుతం రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఉంది. ఇక ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు ప్రకారం... అవతలి వ్యక్తి వ్యాపార ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, నష్ట పరిహారాన్ని కోరే హక్కు కక్షిదారుకు ఉంటుంది. కాగా, విపక్షాల నిరసనలు పెరగడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం సమావేశమైనా అదే పరిస్థితి ఉండడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మూడుసార్లు వాయిదా ఇక రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే ప్రతిపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు, అనంతరం మరో గంటపాటు వాయిదాపడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ భేటీ కాగానే డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ.. ఆర్థిక బిల్లు, వినిమయ బిల్లు ఆమోదానికి సహకరించాలని ప్రతిపక్షాల్ని కోరారు. విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభను మర్నాటికి వాయిదా వేశారు. ఆర్థిక బిల్లుపై చర్చ జరగకపోవడానికి ఆందోళన చేస్తున్న సభ్యులదే బాధ్యతని పేర్కొన్నారు. సభ వాయిదాకు ముందు శనగలపై కస్టమ్స్ పన్ను పెంపు నోటిఫికేషన్ ఆమోదం కోసం మంత్రి జైట్లీ తీర్మానం ప్రవేశపెట్టారు. -
ఆర్థిక బిల్లుపై సాగని చర్చ
న్యూఢిల్లీ: వరుసగా ఏడోరోజు కూడా పార్ల మెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందో ళనలు కొనసాగడంతో కీలకమైన ఆర్థిక బిల్లుపై చర్చను చేపట్టలేకపోయారు. బ్యాంకింగ్ కుంభకోణాలపై ఓటింగ్‌తో కూడిన చర్చ కోసం కాంగ్రెస్, తృణమూల్‌తో పాటు ఇతర విపక్షాలు డిమాండ్ చేయగా.. ఏపీకి ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ, టీడీపీలు, తెలంగాణ లో రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ఎంపీలు నినాదా లతో ఉభయ సభల్ని హోరెత్తించారు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌సభ, రాజ్యసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఆర్థిక బిల్లుతో పాటు 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు చెందిన వినిమయ బిల్లులపై లోక్‌సభలో మంగళవారం చర్చ జరగాల్సి ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షంతో పాటు ప్రాంతీయ పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు కొనసాగించడంతో స్పీకర్ సభను 50 నిమిషాలు వాయిదా వేశారు. రైల్వే, వ్యవసాయం, రైతుల సంక్షేమం, సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలకు గ్రాంట్ల కేటాయింపు డిమాండ్లపై తీర్మానాల్ని కూడా అజెండాలో పొందుపరిచినా.. వాటిపై కూడా ఎలాంటి చర్చా జరగలేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సభ మళ్లీ ప్రారంభమైనా ఆందోళనలు ఆగలేదు. పీఎన్బీ కుంభకోణంపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు, ఏపీకి ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు, తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంచాలని టీఆర్ఎస్, కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు కోసం అన్నాడీఎంకేలు ఆందోళన చేశాయి. లెఫ్ట్ పార్టీల ఎంపీలు కూడా నినాదాలు చేశారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే రాజ్యసభ కూడా బుధవారానికి వాయిదా పడింది. -
టీ బిల్లు ఆర్థిక బిల్లే..
అటార్నీ జనరల్ స్పష్టీకరణ క్లాజ్ 67లో సంచిత నిధి ప్రస్తావన ఉంది సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013ను ఆర్థిక బిల్లుగానే పరిగణించాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి అభిప్రాయపడ్డారు. సంచిత నిధి ప్రస్తావన ఉంది కాబట్టి ఈ బిల్లు ఆర్థిక బిల్లు నిర్వచనం పరిధిలోకే వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. రాజ్యాంగంలోని అధికరణ 110లో ఆర్థిక బిల్లు అంటే ఏమిటో స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతించిన విషయం తెలిసిందే. అరుుతే ఈ బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు వీల్లేదని, బిల్లు ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంది కాబట్టి తొలుత లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలనే వాదన మొదలైంది. దీంతో రాజ్యసభ చైర్మన్ న్యాయసలహా కోరారు. బిల్లును పరిశీలించిన అటార్నీ జనరల్ ఆ బిల్లు ఆర్థిక బిల్లేనంటూ అధికరణ 110 గురించి మంగళవారం రాజ్యసభ చైర్మన్‌కు వివరించారు. అధికరణ 110 ప్రకారం ఆర్థిక బిల్లంటే... ఈ కింది అంశాల్లో ఏది బిల్లులో ఉన్నా అది ఆర్థిక బిల్లే అవుతుంది ఎ. ఏదైనా పన్ను విధింపు, మినహాయింపు, రద్దు, మార్పు, నియంత్రణ బి. డబ్బు తీసుకునే విషయంలో నియంత్రణ లేదా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం, ఏదైనా ఆర్థికపరమైన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం లేదా ఇవ్వబోవడం. సి. సంచిత లేదా ఆగంతుక నిధి కస్టడీ. అటువంటి నిధులకు డబ్బు ఇవ్వడం లేదా వాటి నుంచి డబ్బు ఉపసంహరించడం. డి. సంచిత నిధి నుంచి డబ్బులు వినియోగించడం. ఇ. సంచిత నిధి నుంచి డబ్బులు ఖర్చు చేయడం లేదా ఖర్చు చేసే మొత్తాన్ని పెంచడం. విభజన బిల్లులోని క్లాజ్ 67లో రాష్ట్ర ఏర్పాటు కోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని సంచిత నిధి నుంచి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. సంచిత నిధి ప్రస్తావన ఉంది కాబట్టి పునర్విభజన బిల్లును ఆర్థిక బిల్లుగానే పరిగణించాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు.