
నేటి నుంచి మూడోవిడత హరితహారం
- కరీంనగర్‌లో కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
- గ్రీన్ బ్రిగేడియర్‌ల ఏర్పాటు కోసం అన్ని వర్గాల సహకారం
- గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవార్డులు
- రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్
ఎక్కడికక్కడ గ్రీన్ బ్రిగేడియర్లు (హరిత దళాలు).. హరితహారం గ్రూపులు.. ఎకో క్లబ్‌లు.. వ్యక్తిగత స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవార్డులు.. ఇలా ‘తెలంగాణకు హరితహారం’మూడో విడత కార్యక్రమం ఘనంగా జరగనుంది. హరితహారాన్ని విజయవంతం చేయడం కోసం అన్ని వర్గాల ప్రజల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని సామాజిక ఉద్యమంలా చేపట్టడం ద్వారా హరిత తెలంగాణ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం కరీంనగర్‌లోని లోయర్‌మానేరు డ్యామ్ వద్ద సీఎం కేసీఆర్ మూడో విడత హరితహారాన్ని ప్రారంభించనున్నారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
మూడో విడత హరితహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగేలా.. గ్రీన్ బ్రిగేడ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో గ్రీన్ బ్రిగేడ్‌లు ఏర్పాటు చేయాలని.. 3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పర్యావరణ హితం కోసం ’ఫ్రెండ్స్ ఆఫ్ హరితహారం’పేరిట గ్రూపులను తయారు చేయాలని చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారిని గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. గత హరితహారంలో ఉత్సాహంగా పాల్గొన్న వారితో పాటు మహిళలు, యువకులు, వాకర్స్ గ్రూప్‌లు, పారిశ్రామిక, కార్పొరేట్, ప్రభుత్వ రంగ, స్వచ్ఛంద సంస్థలను తాజా హరితహారంలో పాల్గొనేలా చూడాలన్నారు. చైతన్యవంతంగా ఉండే రోటరీ క్లబ్, ఎన్‌సీసీ కేడెట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్ గ్రూపులు, బార్ ఆసోసియేషన్లను కూడా భాగస్వాములను చేయాలన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 15న గ్రీన్‌డే పాటించాలని.. ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా తప్పనిసరిగా హరితహారంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెద్ద సంఖ్యలో అవార్డులు
హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసే వ్యక్తులు, సంస్థలకు పెద్ద ఎత్తున అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కలిపి దాదాపు 425 అవార్డులు ఇవ్వనున్నారు. వ్యక్తిగత కేటగిరీలో ఒక్కో జిల్లాకు 3 చొప్పున 93, ఉత్తమ హరిత గ్రామ పంచాయతీ, ఉత్తమ మండలం, ఉత్తమ పాఠశాల, ఉత్తమ హైస్కూల్, ఉత్తమ జానియర్, డిగ్రీ, టెక్నికల్ కళాశాలలకు అవార్డులు ఇస్తారు. రూ. లక్ష నుంచి 15 లక్షల రూపాయల దాకా నగదు పురస్కారాలు కూడా ఉండనున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యే, కలెక్టర్, ఫారెస్ట్ ఆఫీసర్ కేటగిరీల్లో అవార్డులు ఇస్తారు. వీటితోపాటు రాష్ట్ర స్థాయిలో మరో 18 అవార్డులు కూడా ఉంటాయి. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఎస్పీ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.
సీఎం బహిరంగసభ
హరితహారం మూడో విడత కార్యక్రమానికి సీఎం కేసీఆర్ బుధవారం కరీంనగర్‌లో శ్రీకారం చుడతారు. కరీంనగర్‌లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు లోయర్‌మానేరు డ్యాం వద్ద ప్రారంభిస్తారు. అనంతరం కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.