
అమెరికా ప్రభుత్వంతో మాట్లాడండి
- భారతీయులపై జరుగుతున్న దాడులపై ప్రధానికి సీఎం లేఖ
హైదరాబాద్: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని, అమెరికా ప్రభుత్వంతో ఈ విషయంపై మాట్లాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కేసీఆర్ ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
అమెరికాలో ఇటీవల వరుసగా భారతీయులపై దాడులు జరగడం దురదృష్టకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయుల బంధువులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. భారతీయుల భద్రత విషయంపై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడాలని ప్రధాని మోదీని కోరారు. అమెరికాలో పరిస్థితులు త్వరలో చక్కదిద్దుకుంటాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ ఇటీవల అమెరికాలోని కాన్సాస్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. శ్వేతజాతి దుండగుడు జాతివివక్షతో ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ విషాదాన్ని మరచిపోకముందే అమెరికాలో ఓ గుర్తు తెలియని దుండగుడు గుజరాత్‌కు చెందిన హర్నీష్ పటేల్ అనే వ్యాపారవేత్తను ఆయన ఇంటి బయటే కాల్చిచంపాడు. మరికొందరు భారతీయులపైనా దాడులు జరిగాయి.