సీమాంధ్ర ఎంపీలు తీవ్రవాదులు: రాజయ్య
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీమాంధ్ర ఎంపీలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తీవ్రవాదులని సిరిసిల్ల రాజయ్య అన్నారు. సీమాంధ్ర ప్రజలను ఎంపీలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిని తమ ప్రాంతంలో అడుగు పెట్టనీయబోమన్నారు. తెలంగాణ టీడీపీ మేలుకోకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే కేంద్రం నిర్ణయం ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు టీడీపీ ఎంపీలు చేయని ప్రయత్నం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ నేతలు టీడీపీని వదిలి రావాలని సూచించారు. టీడీపీ ఎంపీలు వైఎస్సార్ సీపీతో కల్సిపోయారని అన్నారు. సీమాంధ్ర ఎంపీలు స్వార్థపరులు అంటూ దుయ్యబట్టారు. బీజేపీతో టీడీపీ ఎంపీలు మంతనాలు జరుపుతున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అనైతికమని మందా జగన్నాథం విమర్శించారు. మావి త్యాగాలు, వారివి భోగాలు అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే సమయంలో సీమాంధ్ర ఎంపీలు రచ్చ చేయడం మంచిది కాదన్నారు.