శాఖలతో చర్చలు కొలిక్కి
ఉన్నతాధికారులతో 4 గంటలు జీవోఎం చర్చలు
ఆర్థిక, న్యాయ, హోం అంశాలపైనే దృష్టి..
బిల్లు, 371-డిపై న్యాయశాఖ ప్రజెంటేషన్లు
హైదరాబాద్, శాంతిభద్రతలపై టాస్క్‌ఫోర్స్‌తో చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం) కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలతో చర్చలను ఓ కొలిక్కి తీసుకొచ్చింది. పలు శాఖల కార్యదర్శులతో ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపిన జీవోఎం, గురువారం సాయంత్రం నుంచి రాత్రి దాకా ఆర్థిక, రైల్వే, సిబ్బంది వ్యవహారాలు, న్యాయ, నౌకాయాన, పౌర విమానయాన, రోడ్డు-రవాణా శాఖల ఉన్నతాధికారులతో నాలుగు గంటల పాటు సుదీర్ఘ సమాలోచనలు సాగించింది.
నార్త్‌బ్లాక్‌లో జరిగిన ఈ భేటీలో జీవోఎం సారథి, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, సభ్యులు జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ, వి.నారాయణసామి పాల్గొన్నారు. ఆర్థిక, హోం, న్యాయ శాఖలపై సభ్యులు ప్రధానంగా దృష్టి పెట్టారు. హైదరాబాద్ ప్రతిపత్తి, శాంతిభద్రతల నిర్వహణ, ఆర్టికల్ 371-డి, ముసాయిదా బిల్లు తయారీ, ఆస్తులు-అప్పులు, రెవిన్యూ పంపిణీ వంటి కీలకమైన సున్నితాంశాలపై అభిప్రాయాలను తెలుసుకోవడమే గాక అధికారుల నుంచి అదనపు సమాచారాన్ని కోరారని తెలిసింది. జీవోఎం తదుపరి సమావేశం తర్వాత వీటిపై స్పష్టత వస్తుందని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయా శాఖలతో జీవోఎం చర్చల వివరాలు...
హోం... హైదరాబాదే ప్రధానం
జీవోఎం తొలుత హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, టాస్క్‌ఫోర్స్ చీఫ్ విజయ్‌కుమార్, సభ్యుడు వాసన్ తదితరులతో భేటీ అయింది. హైదరాబాద్ ప్రతిపత్తి, శాంతిభద్రతల నిర్వహణ, ఉమ్మడి రాజధానిగా ఉండే సమయంలో నగరంలో రెండు రాష్ట్రాల పాలనా వ్యవస్థలు, ఉమ్మడి రాజధాని పరిధి, తదితరాలపై చర్చించింది. న్యాయపరమైన చిక్కులుండే కొన్ని అంశాలపై న్యాయ శాఖతో మాట్లాడాలని విజయ్‌కుమార్, వాసన్ సూచించారు. ఇక ఆస్తులు, అప్పులతోపాటు రెవెన్యూ పంపిణీ విషయంలో హైదరాబాద్ ప్రతిపత్తి ప్రధాన అవరోధం కనుక దానిపై స్పష్టత ఇవ్వాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పునరుద్ఘాటించారు. పలు ఆర్థికాంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. జీవోఎం కోరిన మేరకు హైదరాబాద్ విషయంలో రెండు మూడు ఆప్షన్లతో పంపిణీ నివేదికలను నాలుగైదు రోజుల్లో సమర్పిస్తామని తెలిపారు.
న్యాయ శాఖ నుంచి రెండు విభాగాల అధికారులు
కీలక సమస్యలైన 371-డి, హైదరాబాద్ ప్రతిపత్తి, బిల్లు తయారీ సంబంధిత అంశాలపై కీలకమైన న్యాయ శాఖలోని రెండు విభాగాల ఉన్నతాధికారులతో జీవోఎం గంటన్నర పాటు చర్చించింది. ముందుగా న్యాయ వ్యవహారాలు, తర్వాత శాసన వ్యవహారాల ఉన్నతాధికారులతో సమీక్షించింది. వారు సవివరంగా ప్రజెంటేషన్లు ఇచ్చారు. అయినా 371-డి, బిల్లు తయారీలపై ఇంకా స్పష్టత రాలేదని, వాటిపై అదనపు సమాచారాన్ని జీవోఎం కోరిందని హోం శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ ప్రతిపత్తిపైనా న్యాయ శాఖ అభిప్రాయాలను కోరారు. 371-డిని ఉంచడమా, తొలగించడమా అన్నది జీవోఎం నిర్ణయించాల్సిందేనని అధికారులు స్పష్టీకరించారు. సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు తొలి ప్రతిని జీవోఎం ముందుంచారు. వారికి సభ్యులు కొన్ని సూచనలిచ్చారు. 20కల్లా ముసాయిదా బిల్లును పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు.
వాల్తేరు రైల్వే జోన్‌పైనా చర్చ
విశాఖ కేంద్రంగా కొత్తగా వాల్తేరు రైల్వే డివిజన్ ఏర్పాటు తదితరాలపై జీవోఎంకు రైల్వే బోర్డు చైర్మన్ నివేదిక ఇచ్చారు. పాలనాపరమైన సమస్యలను పరిహరించేందుకు కొన్ని సూత్రాలను సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారులు సూచించినట్టు సమాచారం. కోస్తా తీరంలోని రేవులు, దుగ్గరాజపట్నం వద్ద తలపెట్టనున్న భారీ ఓడరేవు ప్రాజెక్టుతో పాటు జలమార్గాల అభివృద్ధి తదితరాలపై నౌకాయాన శాఖాధికారులు వివరించారు. రాష్ట్ర, జాతీయ రహదారులు, టోల్ పన్ను వసూలు కేంద్రాలు, సరిహద్దుల మార్పుతో పన్నుల సూళ్లలో వచ్చే మార్పులు తదితరాలపై ఆ శాఖ అధికారులతో జీవోఎం సమీక్షించింది.