తెలంగాణ పోలీస్ సిబ్బందికి వరాల జల్లు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి వరాల జల్లు కురిపిస్తోంది. పోలీస్ సిబ్బందికి ఇస్తున్న భద్రత సొమ్ము భారీగా పెంచుతున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. కిందిస్థాయి సిబ్బందికి ప్రస్తుతం చెల్లిస్తున్న హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ను రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్టు మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఏఎస్సై, ఏఆర్ ఎస్సైలకు రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు పెంచుతున్నట్టు ఆయన తెలిపారు. ఎస్సై కేడర్ అధికారులకు రూ. 7 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు పెంచుతున్నట్టు డీజీపీ చెప్పారు.
డీఎస్పీ ఆపై అధికారులకు రూ.9 లక్షల నుంచి రూ. 11 లక్షల వరకు పెంచుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్లే పోలీసుల పిల్లలకు ఇచ్చే సాయం రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచుతున్నారు. పోలీసుల కూతుళ్ల వివాహాలకు ఇచ్చే రుణాన్ని రూ. 3 లక్షల నుంచి 4 లక్షలు, పోలీసుల ఎక్స్గ్రేషియా ఎస్సై క్యాడర్కు రూ. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు, ప్రమాదంలో మరణించిన పోలీసులకు రూ. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు పెంచుతున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు.