security deposit
-
ఐపీవోలో సెక్యూరిటీ డిపాజిట్ రద్దు
న్యూఢిల్లీ: ఏదైనా కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వచ్చేముందు స్టాక్ ఎక్స్చేంజీల వద్ద తప్పనిసరిగా డిపాజిట్ చేయవలసిన నిబంధనలను తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. ఐపీవో చేపట్టే ప్రణాళికలుగల అన్‌లిస్డెడ్ కంపెనీలకు సెక్యూరిటీ డిపాజిట్‌పై వెసులుబాటు కల్పిస్తూ సెబీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది.దీంతో ఇకపై ఇష్యూ పరిమాణంలో 1 శాతాన్ని స్టాక్ ఎక్స్చేంజీల వద్ద డిపాజిట్ చేయవలసిన అవసరం ఉండదు. సులభతర బిజినెస్ నిర్వహణకు వీలు కల్పించే బాటలో సెబీ వెనువెంటనే అమల్లోకి వచ్చేవిధంగా సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూ ముగిశాక సెక్యూరిటీ డిపాజిట్‌ను స్టాక్ ఎక్స్చేంజీలు తిరిగి చెల్లిస్తున్నాయి.ఐపీవో లేదా రైట్స్‌కు ముందు 1 శాతం మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చేసే నిబంధన రద్దుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సెబీ చర్చాపత్రానికి తెరతీసింది. ప్రస్తుతం ఐపీవో ప్రక్రియలో ఇన్వెస్టర్ల ఖాతా లకు అస్బా అమలుకావడం, యూపీఐ చెల్లింపులు, డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల అలాట్మెంట్ అమలు జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ డిపాజిట్ అవసరానికి కాలం చెల్లినట్లు సెబీ వివరించింది. -
గ్యాస్ వినియోగదారులకు మరో షాక్! వారికి గుది ‘బండ’
సాక్షి, ముంబై: వంట గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచిన కేంద్రం ఇపుడు వినియోగదారులకు మరో షాక్ ఇవ్వనుంది. గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచేసింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. చమురు మార్కెటింగ్ కంపెనీల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తుతోపాటు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. అంటే డొమెస్టిక్ (14.2 కిలోలు) సిలిండర్‌పై సెక్యూరిటీ డిపాజిట్ రూ. 1450గా ఉంది. తాజా పెంపుతో కొత్తసింగిల్ సిలిండర్ ఇండేన్ కనెక్షన్ కోరుకునే వారు రూ.2,500కు పైనే చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు ఇతర చార్జీల బాదుడు కూడా తప్పదు. ఫలితంగా కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందాలనే కస్టమర్లకు అదనపు భారం పడుతుంది. అయితే ఉజ్వల స్కీమ్ వినియోగదారులకు సవరించిన రేట్లు వర్తించవు. అలాగే డబుల్ సిలిండర్ కనెక్షన్ పొందే వారికి మరింత భారం తప్పదు. ఇక రూ. 800గా ఉన్న 5 కేజీల సిలిండర్ డిపాజిట్ మొత్తం రూ. 1150కు చేరింది. దీంతోపాటు రెగ్యులేటర్‌కు గతంలోని 150 రూపాయలతో పోలిస్తే ఇపుడు రూ. 250 చెల్లించుకోవాలి. పెంచిన ధరలు రేపటి నుంచి (జూన్ 16) నుంచి అమలులోకి వస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త కనెక్షన్‌కు రూ.900 నుంచి రూ.1,150కి, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ.200 నుంచి రూ.1,450 చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఉంది. బహుళ కనెక్షన్లు ఉన్నవారు అదనపు కనెక్షన్లను సరెండర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కనెక్షన్లన్నింటినీ బ్లాక్ చేస్తున్నాయి. అంతేకాదు అదనపు కనెక్షన్ సరెండర్ అయ్యే వరకు రీఫిల్‌లను జారీ చేయడం లేదు.అలాగే కనెక్షన్లు బ్లాక్ చేయబడిన కస్టమర్లు మరొక చమురు కంపెనీ నుండి తాజా కనెక్షన్‌ను పొందకుండా నిరోధించేలా కొత్త కనెక్షన్లను నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
నాణేలు.. ‘పది’వేలు
మధ్యప్రదేశ్‌లో నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్‌గా 10 వేల ‘రూపాయి’ బిల్లలు(నాణేలు) చెల్లించి అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు దీపక్ పవార్ అనే అభ్యర్థి. ఇండోర్–3 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి స్వర్ణిమ్ భారత్ ఇంక్విలాబ్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పవార్ నామినేషన్ పత్రాలతోపాటు ఓ సంచీలో ఒక రూపాయి నాణేలు పదివేలు తీసుకువచ్చారు. వీటిని చూసి అధికారులు అవాక్కయ్యారు. చేసేదేమీ లేక చివరకు...ఐదుగురు సిబ్బందితో దాదాపు 90 నిమిషాల పాటు నాణేలు లెక్కించారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశ్వత్ శర్మ మాట్లాడుతూ ‘నామినేషన్‌కు అఖరు తేదీ కావడంతో పవార్ చెల్లించిన 10 వేల రూపాయి బిల్లలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. వాటిని మా సిబ్బంది లెక్కించారు. నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్‌కు సంబంధించిన రశీదును ఆయన ఇచ్చాం’ అన్నారు. ఇంతవరకు ఎన్నికల నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్ కింద ఎవరూ ఇలా రూపాయి నాణేలను ఇవ్వలేదన్నారు. పదివేల రూపాయి నాణేలు ఇవ్వడంపై అభ్యర్థి దీపక్ పవార్ మాట్లాడుతూ ..‘నేను విరాళాల ద్వారా స్వీకరించిన మొత్తం రూపాయి నాణేలే. అందుకే అవే సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాను’ అని చెప్పకొచ్చారు. ‘బుధ్నీ’కా రాజా! మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లా బుధ్నీ నియోజవకర్గం.. ఆ రాష్ట్ర సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌కు పెట్టని కోట. 1990లో ఇక్కడినుంచే ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వాజ్‌పేయి తప్పుకోవడంతో ఖాళీ అయిన విదిశ ఎంపీ స్థానం నుంచి 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 1996, 1992, 1999, 2004ల్లో విదిశ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. 2005లో మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక 2006లో బుధ్నీ నుంచే ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత రాజ్‌కుమార్ పటేల్‌పై 36వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008లో (41వేల మెజారిటీ), 2013లో (84వేలు)నూ బుధ్నీలో సాధించిన ఘన విజయంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. -
అవాక్కయిన అధికారులు!
నాగ్‌పూర్: మహారాష్ట్రలో జరగబోయే శాసన మండలి ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి ఒకరు ధరావతులో రూ.8,500ను రూపాయి నాణాల్లో సమర్పించడంతో ఎన్నికల అధికారులు అవాక్కయ్యారు. గడ్చిరోలి జిల్లాకు చెందిన విలాస్ శంకర్రావ్ బలంవార్ అనే వ్యక్తి నాగ్‌పూర్ డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మంగళవారం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తూ రూ.10 వేల ధరావతులో రూ.8,500ను రూపాయి నాణాల రూపంలో సమర్పించారు. నాలుగు సంచుల్లో తెచ్చిన ఆ నాణాలను లెక్కపెట్టడానికి సిబ్బందికి కొన్ని గంటలు పట్టింది. ధరావతును అలా రూపాయి నాణాల్లో చెల్లించడం వెనక ఉన్న కారణం గురించి అడిగినపుడు..తన నియోజక వర్గంలోని 8,500 నాన్‌ఎయిడెడ్ స్కూలు టీచర్ల నుంచి ఆ నాణాలు సేకరించానని, మిగతా రూ.1500ను సొంతంగా భరించినట్లు చెప్పారు. నాన్ ఎయిడెడ్ స్కూలు టీచర్ల డిమాండ్ల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, వారి కోసమే ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు బలంవార్ చెప్పారు. ఫిబ్రవరి 3న ఈ పోలింగ్ జరగుతుంది. ఫలితాలు 6వ తేదీన వెల్లడవుతాయి. -
తెలంగాణ పోలీస్ సిబ్బందికి వరాల జల్లు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి వరాల జల్లు కురిపిస్తోంది. పోలీస్ సిబ్బందికి ఇస్తున్న భద్రత సొమ్ము భారీగా పెంచుతున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. కిందిస్థాయి సిబ్బందికి ప్రస్తుతం చెల్లిస్తున్న హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌ను రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్టు మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఏఎస్సై, ఏఆర్ ఎస్సైలకు రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు పెంచుతున్నట్టు ఆయన తెలిపారు. ఎస్సై కేడర్ అధికారులకు రూ. 7 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు పెంచుతున్నట్టు డీజీపీ చెప్పారు. డీఎస్పీ ఆపై అధికారులకు రూ.9 లక్షల నుంచి రూ. 11 లక్షల వరకు పెంచుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్లే పోలీసుల పిల్లలకు ఇచ్చే సాయం రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచుతున్నారు. పోలీసుల కూతుళ్ల వివాహాలకు ఇచ్చే రుణాన్ని రూ. 3 లక్షల నుంచి 4 లక్షలు, పోలీసుల ఎక్స్‌గ్రేషియా ఎస్సై క్యాడర్‌కు రూ. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు, ప్రమాదంలో మరణించిన పోలీసులకు రూ. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు పెంచుతున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. -
డీమ్యాట్‌తో వ్యాపారం చేయం
విరాళాలు టీటీడీకి బదిలీ అయ్యేందుకు మాత్రమే: ఈవో సాంబశివరావు తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మికపరమైన కార్యక్రమాలు తప్ప షేర్లు కొనడం, అమ్మడం చేయదని ఈవో దొండపా టి సాంబశివరావు తెలిపారు. మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. శ్రీవారి హుం డీలో భక్తులు నగదు, బంగారం, వెండి, భూమి పత్రాలతోపాటు షేర్లు, సెక్యూరిటీ పత్రాలు సమర్పిస్తుంటారన్నారు. ఇందులో షేర్లు, సెక్యూరిటీ డిపాజిట్లు సులభంగా టీటీడీకి బదిలీ అయ్యేందుకు వీలుగా డీమ్యాట్ అకౌంట్ ప్రారంభించామన్నారు. అదే అకౌంట్‌కు వచ్చే షేర్లు, సెక్యూరిటీ డిపాజిట్లతో తిరిగి షేర్లను కొనడం, అమ్మడం చేయమని ఈవో స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రారంభించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను దేశ వ్యాప్తంగా 2,500 పోస్టాఫీసుల్లో విక్రయించనున్నామని తెలిపారు. -
‘చెత్త’శుద్ధి ఉండాల్సిందే!
సభలు, సమావేశాల తర్వాత శుభ్రత బాధ్యత నిర్వాహకులదే ముందే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి; మార్గనిర్దేశకాలు జారీ చేసిన కేంద్రం న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో జరిగిన సభలు, సమావేశాలకు ఎప్పుడైనా వెళ్లారా? కార్యక్రమం తరువాత ఆ ప్రాంతాన్ని గమనించారా? ఖాళీ వాటర్ బాటిళ్లు, నీళ్ల ప్యాకెట్లు, వాడిపారేసే గ్లాసులు, తిని పడేసిన ఫుడ్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు.. ఇంకా పేపర్లు, కరపత్రాలు, బ్యానర్లు.. ఎక్సెట్రాలతో చెత్త చెత్తగా ఉంటుంది కదా! అంతేకాదు.. టాయిలెట్ల సౌకర్యం లేకపోవడంతో ఆ ప్రాంతమంతా కంపు కొడ్తూ కూడా ఉంటుంది కదా! కార్యక్రమం పూర్తయిందంటే నిర్వాహకులు ఆ చుట్టుపక్కల కూడా కనిపించకపోవడం కూడా మామూలే కదా! ఇకపై అలా కుదరదు. కార్యక్రమం తరువాత నిర్వాహకులు ‘చెత్త శుద్ధి’ బాధ్యత తీసుకోవాల్సిందే. అదీ కార్యక్రమం పూర్తయిన ఆరు గంటల్లోగా ఆ ప్రాంతమంతా శుభ్రపడిపోవాలి. అంతేకాదు.. సభ ప్రాంగణంలో డస్ట్బిన్లు, తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటుచేయాలి. కాదు, కూడదంటే.. మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తారు కానీ ఆ ఖర్చును మాత్రం నిర్వాహకుల దగ్గరే వసూలు చేస్తారు. అందుకోసం ముందే నిర్వాహకుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్‌ను వసూలు చేస్తారు. ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. తక్షణమే అమల్లోకొచ్చేలా ఈ నియమ నిబంధనలను మంగళవారం జారీ చేసి, రాష్ట్రాలకు కూడా పంపించింది. ఆ వివరాలు.. కార్యక్రమ నిర్వహణకు అనుమతి తీసుకునే సమయంలోనే నిర్వాహకులు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అది సభికుల సంఖ్య 500 లోపైతే రూ. 10 వేలు, 5 వేలమందైతే రూ. 50 వేలు, సభికులు 50 వేల వరకు ఉంటే లక్ష రూపాయలను డిపాజిట్‌గా చెల్లించాలి. అనుమతినిచ్చేది పోలీసులైతే.. పోలీసుల వద్దే ఆ డిపాజిట్ ఉంచాలి. కార్యక్రమం తరువాత ప్రాంగణాన్ని శుభ్రం చేయనట్లైతే.. ఆ డిపాజిట్ డబ్బుతో అధికారులే శుభ్రం చేయిస్తారు.