- సివిల్ దుస్తుల్లో పాల్గొనాలని ఆదేశాలు
సర్వే విధులకు 60 శాతం మంది పోలీసులు
Published Tue, Aug 12 2014 1:37 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే కోసం పోలీస్ శాఖలోని 60 శాతం మంది సిబ్బందిని కేటాయించారు. మిగతా వారు బందోబస్తు విధుల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇందుకు దాదాపు నాలుగు లక్షల మంది సిబ్బంది అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో పోలీస్ శాఖ సిబ్బందినీ వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న 60 వేల మంది పోలీసుల్లో దాదాపు 40 వేల మంది సర్వే విధుల్లో పాల్గొననున్నారు.
కానిస్టేబుల్ దగ్గరి నుంచి అదనపు ఎస్పీ స్థాయి అధికారుల వరకూ ఈ సర్వే కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎస్ అధికారులు మాత్రం రోజువారీ కార్యక్రమాలే చూసుకుంటారని పోలీస్ వర్గాలు తెలిపాయి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా సర్వే విధుల నుంచి మినహాయించినట్లు సమాచారం. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు ఆరు వేల మంది పోలీసులను సమగ్ర సర్వే కోసం కేటాయించారు. అయితే సర్వేలో పాల్గొనే పోలీస్ సిబ్బంది సివిల్ దుస్తులే ధరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సర్వే సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించడానికి మిగతా సిబ్బందిని కేటాయించినట్లు సమాచారం. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేకంగా దృష్టి సారించి, ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Advertisement
Advertisement