
టీ ముద్దు.. రాయల వద్దు: టీ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేయాలని, రాయల తెలంగాణ వద్దని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. రాయల తెలంగాణ అంటూ జాప్యం చేయడానికి ప్రయత్నించడమంటే ఇక తెలంగాణ రాదన్న అనుమానం వెలిబుచ్చారు. పది జిల్లాల తెలంగాణ మాత్ర మే కావాలంటూ ఈ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ నేతల తరఫున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ బుధవారం జీవోఎంకు లేఖ రాశారని, జీవోఎం సభ్యుల్ని కలవడానికి స్వయంగా ఢిల్లీకి వెళ్లారని టీ మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. బుధవారం వారు సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ కాకుండా మరే ప్రతిపాదన తెచ్చినా తమకు ఆమోద యోగ్యం కాదన్నారు.
రాయలసీమకు, తెలంగాణకు ముందు నుంచి ఎలాంటి సంబంధం లేదని, సంస్కృతి, సంప్రదాయం, చారిత్రాత్మక నేపథ్యం అంతా వేరని, మద్రాస్ నుంచి విడివడినప్పుడు వారు ఆంధ్రాతో ఉన్నారని వివరించారు. ఉమ్మడి రాజధానికి అంగీకరించాక ఇప్పుడు కొత్తగా రాయల తెలంగాణ అంశాన్ని తేవటం మంచిది కాదని జీవోఎంకు ఇదివరకే స్పష్టం చేశామని, ఈరోజు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి హోంమంత్రి షిండేతో మాట్లాడి తమ వాదనను వినిపించారన్నారు. రాయల తెలంగాణను ప్రకటిస్తే అప్పుడు పరిస్థితుల ఆధారంగా కార్యాచరణ చేపట్టాలో నిర్ణయిస్తామన్నారు.
నేటి బంద్‌కు మా మద్దతు లేదు
రాయల తెలంగాణకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన బంద్‌కు తమ మద్దతు లేదని, ప్రజలు ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేయాలని మంత్రులు కోరారు. బంద్‌కు పిలుపునిచ్చినప్పుడు మాకేమైనా చెప్పి ఇచ్చారా? అని జానారెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.
జీవోఎంకు దామోదర రాసిన లేఖ..
పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీడబ్ల్యూసీ, యూపీఏ ప్రభుత్వం ప్రకటించాక కృతజ్ఞతగా టీ కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున సభలు నిర్వహించారు. కానీ ఇప్పుడు జీవోఎం రాయల తెలంగాణ గురించి తీవ్రంగా ఆలోచిస్తోందని, ఆ మేరకు నివేదిక, ముసాయిదా రూపొందించినట్టు పత్రికల్లో, టీవీల్లో వస్తున్న వార్తలు తెలంగాణ ప్రజల్ని తీవ్ర ఆందోళనపరుస్తున్నాయి. పది జిల్లాలతో కూడిన తెలంగాణను మాత్రమే ఈ ప్రాంత ప్రజలు అంగీకరిస్తారని గతంలో పలుమార్లు మీకు తెలిపాం. హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగానూ ఆమోదించారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్నిగాక మరోవిధంగా ఎలాంటి నివేదిక ఇచ్చినా, బిల్లు తెచ్చినా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినట్లే.