రాష్ట్ర రుణ ప్రణాళిక రూ.59,831 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్య రంగాలకు రూ.59,831 కోట్ల రుణం అవసరమని జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అంచనా వేసింది. మంగళవారం హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగిన రాష్ట్ర రుణ సదస్సులో రుణ ప్రణాళిక అంచనాలను నాబార్డు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 20 శాతం ఎక్కువ. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.43,444.35 కోట్లు కేటాయించారు.
వాటిలో పంట రుణాలకు రూ.30,435.09 కోట్లు, టర్మ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,009.26 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపార రుణాలకు రూ.8,464.58 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.7,922.21 కోట్లని అంచనా వేశారు. రుణ ప్రణాళికను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు. ప్రణాళిక వివరాలను నాబార్డు సీజీఎం వి.వి.వి.సత్యనారాయణ వెల్లడించారు.
పెట్టుబడి రుణాలలో చిన్న నీటిపారుదలకు రూ.621 కోట్లు, వ్యవసాయ క్షేత్రాల యాంత్రీకరణకు రూ.1858 కోట్లు, పొడి, శీతల గిడ్డంగులకు రూ.775 కోట్లు, పట్టు పురుగుల పెంపకం, పూల తోటలు, గ్రీన్‌హౌస్ స్థాపన సహా ఉద్యానవనాలకు రూ.924 కోట్లు కేటాయించామన్నారు. ఫుడ్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డు రూ. 2 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేసిందన్నారు.
రుణమాఫీలో బ్యాంకుల సహకారం అంతంతే
రాష్ట్ర ప్రభుత్వం రూ.17 వేల కోట్ల రైతు రుణ మాఫీ ప్రకటిస్తే బ్యాంకులు సహకారం అందించలేదని ఈటల ఆరోపించారు. ఆర్‌బీఐ నిబంధనలంటూ అడ్డంకులు సృష్టించారన్నారు. వచ్చే ఏడాది, ఆపై ఏడాది ప్రభుత్వం బదనాం కాకుండా రుణమాఫీకి సహకారం అందించాలని బ్యాంకులను కోరారు. పేదలకు రుణాలిచ్చాక, వారు చెల్లించకుంటే ప్రభుత్వ తరఫున సాయం చేస్తామన్నారు. ‘‘ఎన్ని ప్రణాళికలున్నా, హైటెక్ యుగమంటున్నా ఇప్పటికీ 65 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు.
60 శాతం వ్యవసాయంపైనే జీవనం సాగిస్తున్నారు. అంతరాలు మారలేదు.పేదరికం పోలేదు’’ అన్నారు. తెల్ల కార్డులు, ఆరోగ్యశ్రీలు అంతం కావాలంటే ప్రజలు తమ కాళ్లపై నిలబడాలన్నారు. బ్యాంకులు కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న రుణాలెంతో, ప్రజలకు ఇస్తున్నదెంతో ఆలోచించుకోవాలన్నారు. ‘‘రైతులను పరిగణనలోకి తీసుకోకుంటే వృథా. రైతు విషయంలో వడ్డీలను లెక్కిస్తే వారికి సమాజమే బాకీ పడుతుంది’’ అన్నారు.
రుణమాఫీ అర్హులకే అందేలా చూస్తున్నామని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర చెప్పారు. రుణ సదస్సులో ఆర్‌బీఐ ప్రాంతీయ సంచాలకులు ఆర్‌ఎన్ దాస్, ఆంధ్రబ్యాంకు ఎండీ సురేశ్ ఎన్ పటేల్ పాల్గొన్నారు.
ఈటల వ్యాఖ్యలపై గందరగోళం
‘వచ్చే ఏడాది, ఆపై ఏడాది ప్రభుత్వం బదనాం కాకుండా రుణమాఫీకి సహకారం అందించండి’ అన్న ఈటల వ్యాఖ్యలపై గందరగోళం నెలకొంది. రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో హామీ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రెండేళ్లు రెండుసార్లు రుణమాఫీకి బ్యాంకు లు సహకరించాలని ఈటల అనడంపై మీడియా ప్రశ్నించగా తన ఉద్దేశం అది కాదన్నారు. ‘ఒకేసారి రూ.8 వేల కోట్లకు పైగా చెల్లించడమంటే చిన్న విషయం కాదు. అయినా ఒకసారి ఇచ్చే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాం’ అని వివరించారు.