కేంద్ర రుణాల్లో రాష్ట్రం కోత!
సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్నట్టు ఉంది రాష్ర్ట ప్రభుత్వ వ్యవహారం... రైతులకు వ్యవసాయ రుణాల కింద రూ.38 వేల కోట్లు ఇస్తామంటూ కేంద్రం ప్రకటిస్తే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏడు వేల కోట్లు తక్కువగా రూ.30,995 వేల కోట్లతో వ్యవసాయ రుణ ప్రణాళికను తయారుచేసింది. పైగా ఇది గతేడాది కంటే రూ.3,771 కోట్లు ఎక్కువంటూ గొప్పలకు పోయింది. కేంద్ర అధికారుల చీవాట్ల తో చివరకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
రాష్ట్ర రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ. 30,995 కోట్లు కేటాయిస్తూ మంగళవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం లో నిర్ణయించారు. దానిని ప్రభుత్వం కూడా ఆమోదించిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రకటించిన వ్యవసాయ రుణలక్ష్యాల్లో తెలంగాణకు రూ.38 వేల కోట్లుగా పేర్కొంది. ఇది రాష్ర్టం నిర్దేశించుకున్న వ్యవసాయ రుణప్రణాళికకు రూ.7వేల కోట్లు తక్కువ. దీనిపై కేంద్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టినట్లు తెలిసింది.
నాబార్డు సూచనలు తుంగలో తొక్కిన కలెక్టర్లు...
ఖరీఫ్, రబీ సీజన్‌లలో వ్యవసాయ పంట, టర్మ్, అనుబంధ రంగాల రుణాలు ఏ మేరకు ఉండాలనే దానిపై నాబార్డు కొన్ని ప్రతిపాదనలు తయారుచేస్తుంది. ఆ ప్రకారం ఈ ఏడాది కూడా జిల్లాల వారీగా ప్రతిపాదనలు తయారుచేసి కలెక్టర్లకు పంపింది. నాబార్డు ఇచ్చిన ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ సమావేశాలు నిర్వహించింది. బ్యాంకర్లు, వ్యవసాయఅధికారులతో కూడిన కమిటీ ఆయా జిల్లాలకు ఎంత రుణం అవసరమో నివేదిక తయారుచేసి ఎస్‌ఎల్‌బీసీకి పం పించింది.
విచిత్రమేంటంటే నాబార్డు రూ. 35,179 కోట్లు అవసరమని అంచనా వేస్తూ ప్రతి పాదనలు పంపిస్తే రూ. 30,995 కోట్లు మాత్రమే అవసరమని కలెక్టర్లు నివేదికలు పంపించారు. దీనిపై నాబార్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో దీనిపై వాడీవేడి చర్చ జరి గినట్లు తెలిసింది. నాబార్డు అధికారులు చెప్పేవరకు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. నాబార్డు విమర్శల నేపథ్యంలో తాజాగా ప్రకటించిన వ్యవసాయ రుణప్రణాళికను సవరించే యోచనలో సర్కారు ఉంది. మళ్లీ జిల్లాల నుంచి సవరింపుతో రుణ ప్రణాళిక నివేదిక తెప్పించుకొని రూ. 38 వేల కోట్లతో రుణప్రణాళికను తయారు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.