
రాలీ: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు ప్రదీప్ దుర్మరణం చెందారు. భార్యతో కలిసి ప్రయాణిస్తుండగా మినీ బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రదీప్ అక్కడిక్కడే మృతిచెందారు. నార్త్‌కరోలీనాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో ప్రదీప్ భార్య కార్తీకతోపాటు మరికొందరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. వీరికి ఏడాది కిందటే వివాహమైంది.
భువనగిరికి చెందిన ప్రదీప్ ఎనిమిదేళ్ల కిందటే అమెరికా వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. ఏడాది కిందటే భువనగరికే చెందిన అమ్మాయితో అతనికి వివాహమైంది. అనంతరం భార్యను కూడా అమెరికా తీసుకెళ్లాడు. తన పుట్టినరోజు వేడుకలు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రదీప్ అనూహ్యంగా చనిపోయారు. మృతుడు భువనగిరి మాజీ కౌన్సిలర్ మురళి కుమారుడు. మరణవార్త తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.