హెచ్-1బీ వీసాలపై తాత్కాలిక ఊరట
న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసాలపై అమెరికా తాత్కాలిక ఊరట కల్పించనుంది. విదేశీల నుంచి దేశంలోకి వచ్చే నిపుణులపై విధించే నిబంధల ప్రక్రియ కఠినతరం చేయడానికి అంచనావేసిన దానికంటే ఎక్కువ సమయమే పడుతుందని వైట్ హోస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ తెలిపారు. దీంతో హెచ్-1బీ వీసా పాలసీలో నిబంధనలు కఠినతరమవుతాయని ఆందోళన చెందుతున్న భారత కంపెనీలకు తాత్కాలిక ఉపశమనం కలిగినట్టైంది. నిర్దేశించిన టైమ్ ఫ్రేమ్ లో కాకుండా... వీసా పాలసీని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొస్తుందని స్పైసర్ చెప్పారు. హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు తెలియడంతో భారత ఐటీ కంపెనీల్లో ఆందోళనలు చెలరేగాయి. విదేశీ, వాణిజ్య శాఖా కార్యదర్శులు పలుమార్లు వాషింగ్టన్ కు పర్యటించి, కంపెనీలు తెలుపుతున్న నిరసనలను ట్రంప్ ప్రభుత్వ అధికారులతో చర్చించారు.
అనంతరం హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం చేయడానికి అంచనావేసిన దానికంటే ఎక్కువ సమయమే పడుతుందని స్పైసర్ తెలిపారు. అంతకముందు ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ కూడా యూఎస్ కాంగ్రెస్ సభ్యుడికి తెలిపారు. తమ దేశాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకే ప్రస్తుతం తమ ప్రెసిడెంట్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై దృష్టిసారించారని స్పైసర్ పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాలు లేదా భాగస్వామి వీసాలు, ఇతర విద్యార్థి వీసాలు వంటి వాటిని సమగ్రంగా పరిశీలించాల్సి ఉందన్నారు. హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం చేయడం ఇటు వీసా హోల్డర్స్ కు, అటు కంపెనీలకు ప్రతికూలంగా మారనుంది. దీంతో దేశీయ ఐటీ సెక్టార్ గత కొన్నాళ్లుగా ఆందోళనలో కొనసాగుతోంది. ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై ఎలాంటి నిబంధనలు తీసుకొస్తుందోనని భయపడుతోంది.