ఇన్ఫీ బాటలోనే మరో టెక్ దిగ్గజం
ఇన్ఫీ బాటలోనే మరో టెక్ దిగ్గజం
Published Sat, May 6 2017 8:45 AM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM
ట్రంప్ దెబ్బకు టెక్ దిగ్గజాలన్నీ స్థానిక ఉద్యోగాల కల్పనకు తెరతీస్తున్నాయి. ఇటీవలే అమెరికాలోని ఐటీ కంపెనీలో 10వేల ఉద్యోగాలు కల్పిస్తామని టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వీసా నిబంధనలను కఠినతరం చేసిన అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకు ఈ టెక్ దిగ్గజం ఈ ప్రకటన చేసినట్టు ఓ వైపు నుంచి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ఇన్ఫీ బాటలోనే నడుస్తోంది.
అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలను ప్రకటించిన కాగ్నిజెంట్, అమెరికాలో నియామకాల ప్రక్రియను పెంచనున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీకి 75 శాతానికి పైగా రెవెన్యూలు నార్త్ అమెరికా నుంచే వస్తున్నాయి. అయితే క్లయింట్స్ కు సర్వీసులు అందించడానికి ఎక్కువగా హెచ్-1బీ వీసాలపై ఆధారపడే ఈ కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సుమారు 2,60,000 ఉద్యోగాలు భారత్ కు చెందినవారే ఉన్నారు.
అమెరికా వీసా ప్రొగ్రామ్ ను కఠినతరం చేస్తూ ట్రంప్ ఆదేశాలు జారీచేయడంతో, ఇక టెక్నాలజీ సంస్థలు, అవుట్ సోర్సింగ్ కంపెనీలన్నీ స్థానిక ఉద్యోగాల కల్పన బాట పట్టాయి. డెలివరీ సెంటర్లను పెంచడం ద్వారా, హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఎక్కువగా అమెరికాలో నియామకాలు చేపట్టాలని కాగ్నిజెంట్ ప్లాన్ వేస్తోందని ప్రెసిడెంట్ రాజీవ్ మెహతా అనాలిస్టులకు చెప్పారు. గతేడాది కంటే సగం శాతం వీసాలను అప్లయ్ చేయడం తగ్గించామని, ఈ తగ్గింపును మరింత చేపడతామని ఆయన చెప్పారు.
వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించి, లోకల్ గా నియామకాలను చేపడతామన్నారు. గతేడాదే ఈ కంపెనీ అమెరికాలో 4వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. కాగ్నిజెంట్, ఇన్ఫీలు మాత్రమే కాక, ఇటు విప్రో లిమిటెడ్ కూడా అమెరికాలో ఎక్కువమంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ ఏడాది భారత్ కు చెందిన ఈ టెక్ దిగ్గజాలు తమ హెచ్-1బీ అప్లికేషన్లను తగ్గించేశాయి.
Advertisement