ట్రంప్ ఎఫెక్ట్: వారికి బంపర్ ఆఫర్
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అమెరికాలో తన ఉద్యోగులు సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్1బీ వీసా కఠిన నిబంధనల నేపథ్యంలో కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో స్థానికంగా 8000 మంది ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల సమాచారం. అలాగే మరో ఏడు సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేయనుందట. ముఖ్యంగా బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి ఐటీ కంపెనీలకు జారుకుంటున్నాయి. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం ఇన్ఫీ బాటలోనే కాగ్నిజెంట్ కూడా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది.
కాగ్నిజెంట్ 2017సం.రంలో అమెరికాలో ఎనిమిదివేల మందిని కొత్తగా నియమించుకోనుంది. 2016 అమెరికాలో నాలుగువేలమంది ఐటి ఉద్యోగులను నియమించుకుంది. ప్రస్తుత 20 కేంద్రాలకు తోడు యూఎస్‌లో మరో ఏడు డెలివరీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనుంది.
మరోవైపు అమెరికాలో ఉంటున్న సుమారు పదివేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని మరో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ నిర్ణయం తీసుకొంది. రానున్న రెండేళ్లలో 10 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు ఇన్ఫీ ప్రకటించిన సంగతి విదితమే.