కాగ్నిజెంట్‌లో భారీగా తగ్గిన ఉద్యోగులు
కాగ్నిజెంట్‌లో భారీగా తగ్గిన ఉద్యోగులు
Published Thu, Aug 3 2017 6:28 PM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM
బెంగళూరు : ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మార్చి క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్‌కు 4000 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో తగ్గిపోయారు. మార్చి క్వార్టర్‌లో కాగ్నిజెంట్‌లో 261,200 మంది ఉద్యోగులుంటే, జూన్ క్వార్టర్‌కు వచ్చేసరికి ఈ సంఖ్య 256,800కు తగ్గిందని కంపెనీ రెండో క్వార్టర్ ఫలితాల్లో తెలిసింది. టాప్ దేశీయ ఐటీ అవుట్‌సోర్స్ కంపెనీల్లో కెల్లా, దీనిలోనే అత్యధికంగా ఉద్యోగుల సంఖ్య పడిపోయింది.
కాగ్నిజెంట్ ప్రత్యర్థులు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా కంపెనీల్లో కూడా ఉద్యోగులు తగ్గిపోయారు. కానీ ఈ మేర తగ్గడం దీనిలోనే. కాగ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్నాయి. అయితే కాగ్నిజెంట్ తన రెవెన్యూ గైడెన్స్‌ను పెంచింది. గతంలో తక్కువగా అంచనావేసిన 8-10 శాతం వృద్ధిని, 9-10 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. అంతేకాక మూడో క్వార్టర్‌లో వృద్ధి రేటు 1.6-3 శాతముంటుందని కాగ్నిజెంట్ అంచనావేస్తోంది.
గురువారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ నికర లాభం 86 శాతం ఎగిసి ఈ క్వార్టర్‌లో 470 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ లాభం 252 మిలియన్ డాలర్లు మాత్రమే. హెల్త్ కేర్ లాంటి వాటిలో గణనీయమైన వృద్ధిని సాధించడంతో కంపెనీ లాభాలు భారీగా ఎగిసినట్టు తెలిసింది. రెవెన్యూలు కూడా తొలి క్వార్టర్ కంటే ఈ క్వార్టర్‌లో 8.9 శాతం పెరిగి 3.67 బిలియన్ డాలర్లగా నమోదైనట్టు కాగ్నిజెంట్ తెలిపింది. రెండో క్వార్టర్‌లో బలమైన ఫలితాలను ప్రకటించామని కంపెనీ తెలిపింది. ఒక్కో షేరుకు 0.80 డాలర్ల లాభం చేకూరుతుందని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇది 0.41 డాలర్లుగా మాత్రమే ఉందని కాగ్నిజెంట్ తెలిపింది.
Advertisement
Advertisement