► సీఎం నిర్ణయం మేరకు నడుచుకోవాలని భావిస్తున్న అధికారులు
► విభజన ప్రణాళిక మేరకు రాష్ట్రానికి 11 మంది డెరైక్టర్లు
► 2018 మార్చితో ముగియనున్న సభ్యుల పదవీకాలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) ప్రస్తుత పాలక మండలి సభ్యుల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. 2018 మార్చితో ప్రస్తుత పాలక మండలి సభ్యుల పదవీ కాల పరిమితి ముగియనుంది. అయితే పాలక మండలి సభ్యులు, చైర్మన్ నియామకం రాజకీయాలతో ముడిపడి ఉండటంతో రద్దు ప్రతిపాదన తెర పైకి వస్తోంది. పాలక మండలి కొనసాగించాలా.. లేక రద్దు చేయాలా అనే అంశంపై అధికార పార్టీ ముఖ్య నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం మేరకు పాలక మండలి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని చేనేత, జౌళి శాఖ అధికారులు భావిస్తున్నారు.
పెరుగుతున్న ఒత్తిళ్లు
ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) విభజన ప్రణాళికకు గతేడాది ఆగస్టులో షీలాబిడే కమిటీ ఆమోదం తెలిపింది. 2015 అక్టోబర్ 31 నుంచి తెలంగాణ చేనేత సహకార సంఘం (టెస్కో) సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆప్కో పాలక మండలిలో 24 మంది ైడె రెక్టర్లుగా ఉండగా.. విభజన ప్రణాళిక మేరకు తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్‌కు 13 మంది డెరైక్టర్లను కేటాయించారు. వీరందరూ ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరిలో నియమితులు కాగా.. 2018 మార్చి 16కల్లా వీరి పదవీకాలం ముగియనుంది. పాలక మండలి విభజన జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం 11 మంది సభ్యుల్లో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని.. కొందరు డెరైక్టర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వీరి ప్రతిపాదనకు టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు కీలక మంత్రులు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. గతంలో ఆప్కో చైర్మన్‌గా పనిచేసిన నేత ఒకరు.. ప్రస్తుత పాలక మండలిని రద్దు చేసి కొత్తగా నియమించాలంటూ లాబీయింగ్ చేస్తున్నారు. ఇరువైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. సీఎం మార్గనిర్దేశనం మేరకు నడుచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై దిశానిర్దేశం చేయాలంటూ సీఎంకు మంత్రి లేఖ రాసినట్లు సమాచారం. ఆప్కో విభజన ప్రణాళికకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తుది ఆమోదం తెలిపితే తప్ప.. నూతన పాలక మండలిని నియమించే అవకాశం లేదని చేనేత శాఖ వర్గాలు వెల్లడించాయి.
టెస్కో పాలక మండలి రద్దా? కొనసాగింపా?
Published Mon, Mar 14 2016 2:48 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement