
ఇక 15జీ, 15హెచ్ ఫామ్స్ దాఖలు మరింత సులభం
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) 15జీ, 15హెచ్ ఫామ్స్ పూర్తిచేసే ప్రక్రియను సరళతరం చేసింది. పన్ను చెల్లింపుదారులకు ఈ ఫామ్స్ పూర్తి చేయటాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఆదాయం పన్ను పరిధి లోపు ఉండి, వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పొందాలనుకునే వారు 15జీ, 15హెచ్ ఫామ్స్‌ను దాఖలు చేస్తారు. అలాగే డిడక్టర్స్‌కు సంబంధించిన ఫామ్స్ దాఖలు విధానాన్ని కూడా సరళతరం చేసింది.
ఇందులో అన్ని దాఖలుకు ప్రత్యేక గుర్తింపు నెంబర్‌ను కేటాయిస్తోంది. అటు పన్ను చెల్లింపుదారులకు, ఇటు ట్యాక్స్ డిడక్టర్స్‌కు వ్యయాలను తగ్గించే లక్ష్యంగా ఈ సవరణలను చేసినట్టు సీబీడీటీ పేర్కొంది. సవరించిన విధానాలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. 15జీ ఫామ్స్‌ను పన్ను పరిధిలోకి రాని వ్యక్తులు, 15హెచ్ ఫామ్స్‌ను వృద్ధ పౌరులు దాఖలు చేస్తారు.