50వేల కోట్ల యుద్ధ నౌకలు పనిచేయవా?
రక్షణ శాఖ కొత్తగా నిర్మించిన రెండు యుద్ధ నౌకల సేవలను యూకే వినియోగించుకోలేకపోవచ్చా?. తాజాగా యూకే నేషనల్ ఆడిట్ లో వెల్లడైన లెక్కలు ఈ విషయాన్ని ధ్రవీకరిస్తున్నాయి. నౌకలకు విద్యుత్తు సరఫరా చేసే కేబుల్స్ కొనుగోలుకు రక్షణ శాఖ దగ్గర డబ్బు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ రెండు యుద్ధ నౌకల నిర్మాణానికి యూకే రక్షణ శాఖ ఇప్పటికే 50,504 కోట్లకు పైచిలుకు ఖర్చు చేసింది.
యూకే మిలటరీ బేస్ ల ఖర్చును పర్యవేక్షించిన నేషనల్ ఆడిట్ ఆఫీసు కొత్త యుద్ధ నౌకలు విద్యుత్తు సరఫరా కొరతతో నిలిచిపోతాయని తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే రక్షణ శాఖ వద్ద తీవ్రంగా నిధుల కొరత ఏర్పడినట్లు చెప్పింది. వచ్చే 30 ఏళ్లలో అవసరమయ్యే 8.5 బిలియన్ల పౌండ్లను రక్షణ శాఖ ఖర్చు చేయలేదని తేల్చిచెప్పింది.
దీనిపై స్పందించిన రాయల్ నేవీ పవర్ కేబుల్స్ ను అవసరమైన చోట అమర్చుతామని పేర్కొంది. 2017 ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే హెచ్ఎమ్ఎస్ క్వీన్ ఎలిజిబెత్ యుద్ధ నౌక కోసం పోర్ట్స్ మౌత్ నావల్ బేస్ ను కూడా సిద్ధం చేస్తామని రాయల్ నేవీ ప్రతినిథి ఒకరు తెలిపారు.