
ఆ ఏడుపు విని తల్లి స్పందించింది..
బిడ్డను ప్రసవించి కోమాలోకి వెళ్లిపోయింది ఆ కన్నతల్లి. ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. వైద్యులు శతవిధాల ప్రయత్నించి ఆమె ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలున్నీ బుడిదలో పోసిన పన్నీరులా తయారైంది. ఆమె బీపీ 60/40కి పడిపోయింది. హృదయ స్పందన సాధారణ స్థాయి కంటే కూడా విపరీతంగా కొట్టుకుంటోంది. చివరికి ఆమె పరిస్థితి ఎలా తయారైందంటే దినదిన గండం నూరేళ్ల ఆయుషులా తయారైంది. ఇక తమ వల్ల కాదని వైద్యులు చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది.
ఇంతలో పైన ఉన్న దైవుడే కరుణించాడో లేక ఆ నవ జాత శిశువుకు తల్లి అవసరం ఉందని ఆయన భావించాడో కానీ కోమాలో ఉన్న ఆమెకు సపర్యలు చేస్తున్న నర్స్కు ఓ ఆలోచన వచ్చేలా చేశాడు. అంతే అప్పుడే పుట్టిన శిశువుకు తల్లికి అనుబంధం ఉంటుందని అంటారు కదా అలా. కోమాలో తల్లి వద్ద శిశువును ఉంచుదామని వైద్యులుకు తెలిపింది. అంతే అనుకున్నదే తడవుగా దానిని ఆచరణలో పెట్టారు. ఆ శిశువును తల్లి వద్ద ఉంచి బుగ్గ మీద వేలుతో తట్టారు. ఆ బిడ్డ ఏడవటం ప్రారంభించింది.... ఆ ఏడుపు విని ఆ తల్లి స్పందించడం ప్రారంభించింది.
దాంతో వైద్యులు ఆ శిశువును తల్లి వద్దే ఉంచి వైద్యం చేయడం ప్రారంభించారు. దాంతో తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటమే కాకుండా... ఆరోగ్యవంతురాలైంది. ఈ ఘటన గతేడాది సెప్టెంబర్లో యూఎస్లోని ఉత్తర కరోలినా ఆసుపత్రిలో ప్రసవించేందుకు వచ్చిన షెల్లీ క్వాలే జీవితంలో చోటు చేసుకుంది. ఈ మేరకు షెల్లీ క్వాలే తన జీవితంలో చోటు చేసుకున్న ఈ సంఘటనను ఇటీవల మీడియాకు వెల్లడించింది.