అపుడు జాతీయ క్రీడాకారిణి..ఇపుడు
చిరాంగ్: ఒకప్పటి ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతలు తర్వాతి కాలంలో జీవనోపాధికోసం అష్టకష్టాలు పడుతున్న వైనం పై అనేక కథనాలు వెలుగు చూశాయి. తాజాగా అసోంకు చెందిన క్రీడాకారిణి దుర్బర పరిస్థితుల్లో జీవనాన్ని సాగించడం తాజా కలకలం రేపింది. ఒకపుడు జాతీయ స్థాయిలో గెల్చుకున్న పతకాలతో ఆమె ముఖంగా కళకళలాడింది. కానీ నేడు మండుటెండలో రోడ్డు పక్కన కమలాలు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమె పేరే ప్రముఖ ఆర్చర్ బులి బాసుమతారీ. ఒకపుడు ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలలో రెండు బంగారు, వెండి పతకాలు ఆమె సొంతం. కానీ ఇపుడు ఇద్దరు పిల్లల తల్లి అయిన బులి ఇపుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు స్ట్రీట్ వెండర్ గా మారిపోయింది. గత మూడేళ్లుగా ఈ ఆర్చర్ పేదరికంతో దీనంగా కాలం గడుపుతోంది.
అస్సో చిరాంగ్ జిల్లా కు చెందిన బులి బాసుమతారీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద ఆర్చరీలో శిక్షణ తీసుకుంది. అనంతరం నేషనల్ సబ్ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో రజతం గెలుచుకుంది. ఆతర్వాత నేషనల్ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ 50 మీటర్ల ఈవెంట్లో రెండు స్వర్ణం పతకాలను గెలుచుకుంది. 2010లో అనారోగ్యం పాలుకావడంతో క్రీడకు దూరమైంది. అనంతరం పేదరికంతో ఆమెను ఆర్చరీ క్రీడకు మరింత దూరం చేసింది. అయితే అక‍్కడితో బులి ఆగిపోలేదు. హయ్యర్ సెకెండరీ స్కూలు విద్యార్థులకు ఆర్చరీ క్రీడలో శిక్షణ ఇస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుకుంటోంది.
అనేక పతకాలు గెలుచుకున్న తాను గత మూడేళ్లుగా కమలాలు అమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నాని బులి వాపోయింది. పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతోంది.
అయితే దీనిపై రాష్ట్ర క్రీడా మంత్రిత్వశాఖ స్పందించింది. త్వరలోనే ఆమెను ఆర్చరీ కోచ్ నియమించనున్నట్టు మంత్రి పల్లబ్ లోచన్ దాస్ తెలిపారు. దీనికి ముందు పంజాబ్‌లో స్వల్ప కాలిక శిక్షణ ఇప్పించి అనంతరం, వచ్చే వారంలోనే ఆమెను కోచ్ గా నియమిస్తామని చెప్పారు.