విజయ పాలల్లో పందికొక్కు
ఎంహెచ్‌వో తనిఖీలో బయటపడిన డెయిరీ నిర్లక్ష్యం
నెల్లూరు సిటీ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని విజయ డెయిరీ పాలల్లో పందికొక్కు కనిపించింది. నగరపాలక సంస్థ అధికారుల తనిఖీల్లో ఇది బయటపడింది. స్థానిక వెంకటేశ్వరపురంలో విజయ డెయిరీ ఉంది. వారం కిందట వెంకటేశ్వరపురానికి చెందిన వైష్ణవి అనే చిన్నారి డెంగీ జ్వరంతో మృతిచెందింది. ఈక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (ఎంహెచ్‌వో) వెంకటరమణ బుధవారం దోమలు వ్యాప్తి చెందే ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో డెయిరీ సమీపంలో అపరిశుభ్రత కనిపించింది. డెయిరీ లోపలికి వెళ్లి పరిశీలించారు. పాలు నిల్వ ఉంచిన ఒక ట్రేలో పందికొక్కు కనిపించింది.
ఈ విషయాన్ని కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.ఎస్.మూర్తికి తెలిపారు. కమిషనర్ డెయిరీకి వచ్చి కోల్డ్‌స్టోరేజ్‌ను, పాలు ఫిల్టర్ చేసే పరికరాలను పరిశీలించారు. డెయిరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిరీని నిర్వహించే తీరు ఇదేనా? అని ఎండీ కృష్ణమోహన్‌ను ప్రశ్నించారు. గంటల వ్యవధిలోనే అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూస్తానని, 10 రోజులు సమయం కావాలని ఎండీ కోరారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏ కంపెనీనైనా సీజ్ చేసేందుకు వెనుకాడబోమని కమిషనర్ మూర్తి హెచ్చరించారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత లోపిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు.