పని చేయడానికి క్రేజీ కంపెనీ ఇదేనట..!
బిజినెస్ స్టూడెంట్లకు ఎక్కడ పని చేయాలని ఉందని అడిగితే.. వారి నోటనుంచి వచ్చే మొదటి పేరు గూగుల్ కంపెనీదేనట. గూగుల్ కంపెనీలో జాబ్ అంటే తెగ ఇష్టపడుతున్నారట. గ్లోబల్ రీసెర్చ్, అడ్వయిజరీ సంస్థ యూనివర్సమ్ చేపట్టిన సర్వేలో గూగుల్ అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో యాపిల్, ఈవై, గోల్డ్ మ్యాన్ సాక్స్, పీడబ్ల్యూసీలు ఆకర్షణీయమైన కంపెనీలుగా నిలుస్తున్నాయి.
డెలాయిట్, మైక్రోసాప్ట్, కేపీఎమ్జీ, లోరియల్, జేపీ మోర్గాన్ లు టాప్-10లో స్థానం దక్కించుకున్నాయి. 12 నెలల పాటు మొత్తం ప్రపంచంలోని12 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో యూనివర్సమ్ ఈ సర్వే నిర్వహించింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, రష్యా, యూకే, అమెరికా దేశాల్లో, మొత్తం 2,67,000 బిజినెస్, ఇంజనీరింగ్, ఐటీ విద్యార్థులపై రీసెర్చ్ సంస్థ ఈ సర్వేను చేపట్టింది. విద్యార్థులు ఎక్కువగా ఏ కంపెనీలో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారో ఈ సర్వేలో వారిని అడిగి తెలుసుకున్నారు.
వర్క్- లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ కంపెనీల్లో ఒత్తిడి తక్కువగా ఉంటుందని విద్యార్థులు చెప్పినట్టు రీసెర్చ్ తెలిపింది. టెక్ కంపెనీలు, బ్యాంకులు, ప్రొఫెషనల్ సేవలు అందించే కంపెనీలు బిజినెస్ స్టూడెంట్లకు ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటున్నాయని ఈ సర్వేలో తేలింది. 24/7 సమయాల్లో ఈ కంపెనీ స్టాప్, ప్రపంచానికి అనుసంధానమై ఉంటున్నారు.
అయితే 2014లో సర్వేలో పాల్గొన్న మూడింట రెండువంతుల మంది ఉద్యోగంలో చేరడానికి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ప్రధాన అడ్డంకుగా నిలుస్తుందని చెప్పారని ఈ రిపోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ సమస్య కొంత మెరుగైనట్టు వెల్లడించింది. ఇటీవలే ఎకనామిక్ టైమ్స్, గ్రేట్ ప్లేస్ టూ వర్క్ ఇన్ స్టిట్యూట్ భారత్ లో జరిపిన బెస్ట్ వర్క్ ప్లేస్ టెక్పాలజీ కంపెనీల్లో కూడా గూగులే మొదటిస్థానంలో నిలిచింది. ఉద్యోగులకు చక్కని సౌకర్యాలు కల్పిస్తూ.. వారి టాలెంట్ ను విస్తరించేలా గూగుల్ అవకాశం కల్పిస్తోందని ఆ సర్వేలో వెల్లడైంది.