ఉద్యోగానికి గూగుల్ బెస్ట్!
న్యూఢిల్లీ: పనిచేయడానికి అత్యుత్తమ కంపెనీగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నిలిచింది. అంతర్జాతీయ ఎంప్లాయర్ బ్రాండింగ్ కంపెనీ యూనివర్సమ్స్ రూపొందించిన ఈ ఏడాది అత్యంత ఆకర్షణీయ కంపెనీల జాబితాలో గూగుల్ మొదటి స్థానాన్ని సాధించింది. బిజినెస్ విద్యార్ధులు పనిచేయడానికి ఇష్టపడే కంపెనీలు ఒక జాబితాగానూ, ఇంజనీరింగ్, ఐటీ విద్యార్ధులు పనిచేయడానికి ఇష్టపడే కంపెనీలు ఒక జాబితాగానూ ఈ సంస్థ రూపొందించింది. ఈ రెండు జాబితాల్లో గూగుల్ టాప్‌లో నిలిచింది.
అయితే ఏ జాబితాలోనూ ఏ ఒక్క భారత కంపెనీకి స్థానం దక్కలేదు. ఈ జాబితాల్లోని కంపెనీలకు భారత్‌లో ఉద్యోగులు భారీగానే ఉన్నారు. బిజినెస్ విద్యార్ధులకు సంబంధించి ఆకర్షణీయ కంపెనీల జాబితాలో గూగుల్ తర్వాతి స్థానాల్లో డెలాయిట్, సిటి, యాపిల్, పీ అండ్ జీ నిలిచాయి. ఇంజినీరింగ్, ఐటీ విద్యార్ధులకు సంబంధించిన జాబితాలో గూగుల్ తర్వాత యాపిల్, మైక్రోసాఫ్ట్, శామ్‌సంగ్, బీఎండబ్ల్యూలు నిలిచాయి. ఈ రెండు కేటగిరీలకు సంబంధించి ఒక్కో జాబితాలో 50 కంపెనీలున్నాయి.