కొడుకు, తమ్ముడు కంటే పార్టీనే ముఖ్యం: ములాయం
కొడుకు, తమ్ముడు కంటే పార్టీనే ముఖ్యం: ములాయం
Published Fri, Dec 30 2016 8:01 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM
లక్నో: ' సమాజ్ వాదీ పార్టీ స్థాపన నుంచి ఇప్పటి వరకు నేను ఎంతో కష్టపడ్డా. ఎన్నో కష్టనష్టాలు అనుభవించా. నా జీవత సర్వస్వాన్నీ ధారపోసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చా. అలంటిది ఇప్పుడెవరో వచ్చి ఫలాలు అనుభవిస్తానంటే సహించేదిలేదు. కొడుకు, తమ్ముడు బంధాలకన్నా పార్టీనే నాకు ముఖ్యం. పార్టీని కాపాడుకోవడానికే అఖిలేశ్ యాదవ్, రాంగోపాల్ యాదవ్‌లను బహిష్కరించా' అని ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అన్నారు. కొద్ది నెలలుగా పార్టీలో కొనసాగుతోన్న అంత్గత పోరుకు తెరదించుతూ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించిన ఆయన అందకుగల కారణాలకు వివరించారు.
అఖిలేశ్ ను సీఎం పదవి నుంచి కూడా తొలిగిస్తామని, కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది తానే నిర్ణయిస్తానని ములాయం చెప్పారు. 'అఖిలేశ్ మాట వినే రకం కాదు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉంటాడు. రాంగోపాల్ యాదవ్ మాటలు విని బాగా చెడిపోయాడు. పార్టీ నిర్ణయాలను ధిక్కరించాడు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. అందుకే అతణ్ని బహిష్కరించా. ఇక రాంగోపాల్ సంగతంటారా.. అతను పార్టీకి చీడలా తయారయ్యాడు. అధ్యక్షుడి అనుమతి లేకుండా జాతీయ కౌన్సిల్ సమావేశానికి పిలుపునిచ్చే అధికారం రాంగోపాల్‌కు లేదు. ఆ విషయం తెలిసికూడా సమావేశానికి పిలుపునిచ్చాడు. వీళ్లని ఉపేక్షిస్తే పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే గెంటేశా. క్షమాపణలు చెప్పినా వెనక్కి తగ్గేదిలేదు' అని ములాయం పేర్కొన్నారు. బహిష్కరణ నిర్ణయాన్ని వెల్లడించే సమయంలో ములాయం వెంట ఆయన తమ్ముడు, ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ కూడా ఉన్నారు.
Advertisement
Advertisement