'అది చాలా ప్రమాదకరమైన ఆలోచన'
న్యూఢిల్లీ: మహా కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని ఆయన చెప్పారు. మహా కూటమి తరపున పోటీ చేయనున్న 242 అభ్యర్థుల పేర్లను బుధవారం ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆర్జేడీ, కాంగ్రెస్ పరస్పర అంగీకారంతో అభ్యర్థులను ఎంపిక చేసినట్టు చెప్పారు.
అభివృద్ధే తమ ఎన్నికల ఎజెండా అని చెప్పారు. బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను నితీశ్ తప్పుబట్టారు. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన అని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. బీజేపీకి సుప్రీంకోర్టులా ఆర్ఎస్ఎస్ మారిందని దుయ్యబట్టారు.